5 Corona Cases Found In a Family in Bhupalapally: తెలంగాణలో (Telangana) కరోనా కేసులు (Corona Cases) కలకలం రేపుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కుటుంబంలోని వృద్ధురాలికి (65) 3 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమెను వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. ఆ కుటుంబంలోని మిగిలిన నలుగురికి కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని అధికారులు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డీఎంహెచ్ వో మదుసూదన్ వెల్లడించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. జిల్లాలో వంద పడకల ఆస్పత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు, తెలంగాణలో ప్రస్తుతం 50 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వారికి అలర్ట్
కరోనా కేసులు అలజడి సృష్టిస్తోన్న నేపథ్యంలో పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా, మాస్క్ ధరించాలంటున్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని, అనుమానం ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అధికారులకు మంత్రి ఆదేశాలు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మెడిసిన్, మాస్కులు, టెస్టుల విషయంలో జాగ్రత్త వహించాలని, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్స్ లో టెస్టులు చేసేందుకు అవకాశం ఉందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్దేశించారు. ఇప్పటివరకూ 40 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.