ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ స్కూల్‌లో టీచర్‌ సూచన మేరకు ఓ విద్యార్థిపై మరో విద్యార్థి చెంప దెబ్బ కొట్టిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడం  తెలిసిందే. ఈ క్రమంలో బాధిత విద్యార్థి ఐడెంటినీ బహిర్గతం చేసినందుకు ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబేర్‌పై కేసు నమోదైంది. ఏడేళ్ల విద్యార్థి గుర్తింపును వెల్లడి చేసినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 


పిల్లల సంరక్షణ చట్టం సెక్షన్‌ 74 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలలో మైనర్‌ గుర్తింపును ఎట్టి పరిస్థితిలో బహిర్గతం చేయకూడదు. పిల్లల ప్రైవసీని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని విష్ణు దత్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో మాన్‌సూర్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 


ఆగస్టు 24 న ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో టీచర్‌ హోం వర్క్‌ చేయనందుకు ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థితో కొట్టించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా స్కూల్‌ రాష్ట్ర విద్యా శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. బాధిత బాలుడి కుటుంబం ఫిర్యాదు మేరకు టీచర్‌పై ఐపీసీ సెక్షన్‌ 323, 504 ప్రకారం కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, మతసామరస్యాన్ని దెబ్బతీయడం లాంటి ఆరోపణలతో కేసు పెట్టారు. అయితే ఇది బెయిలబుల్‌, వెంటనే అరెస్ట్‌ చేసే తరహా కేసు కాదు. వారెంట్‌ అవసరం అవుతుంది.


అయితే టీచర్‌ తృప్తి త్యాగి మాత్రం.. తాను విద్యార్థి హోం వర్క్‌ చేయలేదన్న కోపంతోనే తోటి విద్యార్థితో కొట్టించానని, ఇందులో మత పరమైన వివక్ష ఏమీ లేదని చెప్పారు. తాను దివ్యాంగురాలినని, లేచి కొట్టలేనని అందుకే మరో విద్యార్థితో అలా చేయించానని వివరణ ఇచ్చారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులు కూడా చాలా సార్లు తమ కొడుకు గురించి చెప్పారని, కాస్త మందలించమని కోరారని అన్నారు. డియో టాంపర్‌ చేశారని, బాలుడి బంధువే వీడియో తీశారని, ఆందోళనలు సృష్టించడానికే ఇలా చేశారని కూడా టీచర్‌ ఆరోపించారు. విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం.. టీచర్‌ తమ అబ్బాయిని తోటి విద్యార్థులతో పదే పదే కొట్టించారని, దాదాపు రెండు గంటల పాటు హింసించారని, ఇప్పటికీ బాబు భయంతోనే ఉన్నాడని చెప్తున్నారు. ఈ ఘటన వల్ల బాబు బాగా చలించిపోయాడని, రాత్రి నిద్ర కూడా పోవడం లేదని అంటున్నారు.


ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌ అయ్యింది. విచారణ కొనసాగుతున్నందున స్కూల్‌ బంద్‌ చేయాలని ఆదేశించింది. విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టింది. స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. స్కూల్‌ బంద్‌ చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్థానిక స్కూళ్లలో వారికి అడ్మిషన్లు కూడా ఇచ్చారు. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు స్కూల్‌ తిరిగి తెరవకూడదని అధికారులు వెల్లడించారు. 


ఈ వీడియోలో టీచర్‌ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లోని విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరు బాలుడిని కొట్టమని చెప్పింది. టీచర్‌ చెప్పినట్లుగానే విద్యార్థులు అబ్బాయి చెంపపై కొట్టారు. టీచర్‌ చైర్‌లో కూర్చొని ఇంకా కొట్టండి అంటూ ఆర్డర్ వేసింది.