రాష్ట్రపతిగా పోటీ చేయలేను-ఫరూక్ అబ్దుల్లా


ప్రస్తుతానికి దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎన్నికల వేడి బాగానే రాజుకుంది. ప్రతిపక్షాలన్నీ భాజపాపై దాడిని ఈ ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నాయి. భాజపాయేతర పార్టీలన్నీ ఏకమై ఉమ్మడి రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ జాబితాలో చాలా మంది పేర్లే వినిపించాయి. మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీతో పాటు ప్రధానంగా అందరి నోటా వినిపించిన పేరు ఫరూక్ అబ్దుల్లా. లోక్‌సభ ఎంపీగా, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లాకి మంచి రాజకీయ అనుభవముందని, ఆయననే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రతిపాదించారు. అయితే ఫరూక్ అబ్దుల్లా ఇందుకు భిన్నంగా స్పందించారు. ఈ పోటీలో నిలబడాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. ఆ జాబితాలో నుంచి తన పేరు తొలగించాలని ప్రతిపక్షాలను కోరినట్టు వెల్లడించారు. 


జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం...


తనకు ఎందుకు ఆసక్తి లేదో కూడా వివరించారు ఫరూక్ అబ్దుల్లా. ప్రస్తుతానికి జమ్ము, కశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి దేశ రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని అంటున్నారు. జమ్ము, కశ్మీర్ ప్రాంతానికి చేయాల్సిది చాలా ఉందని, ఇక్కడ పురోగతి ఎలా సాధించాలి అనే అంశంపైన తాను పూర్తిగా దృష్టి సారిస్తున్నానని వెల్లడించారు. తన పేరు సూచించినందుకు దీదీకి కృతజ్ఞతలు తెలిపిన ఫరూక్ అబ్దుల్లా, తనకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలకూ ధన్యవాదాలు చెప్పారు.





 


విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు చాలా రోజులుగా మేధోమథనం సాగిస్తున్నాయి. మొదట కాంగ్రెస్ ఈ బాధ్యతను తీసుకుని ప్రతిపక్షాలను కలుపుకుని పోయేందుకు గట్టిగానే కృషి చేసింది. అయితే పలు పార్టీలు కాంగ్రెస్‌ అభిప్రాయాలతో విభేదించటం వల్ల పూర్తి స్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఈ లోగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత 
తీసుకున్నారు. చకచకా పావులు కదిపి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేలా అందరూ సహకరించాలని కోరారు. దాదాపు నాలుగు రోజుల చర్చల తరవాత మమతా బెనర్జీ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశామని స్పష్టం చేశారు దీదీ.  "మేం ఎన్నుకునే అభ్యర్థికి అందరమూ మద్దతునివ్వాలని నిర్ణయించాం. ఎన్నో నెలలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్‌ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం" అని అన్నారు మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.