ఆరుగాలం కష్టించి ఆహార ధాన్యాలను పండించిన రైతులకు మలి వయసులో ఆర్థిక ఆసరాను ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనను కేంద్రం తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం కిసాన్) కింద డబ్బులు పొందే రైతులకు ఇది గుడ్ న్యూస్. పీఎం కిసాన్ కింద డబ్బులు వచ్చే రైతులు రూ.3000 వరకు పెన్షన్ పొందుతారు.
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన కింద రైతులకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్ ఖాతాదారు అయితే.. మీ రిజిస్ట్రేషన్ నేరుగా పీఎం కిసాన్ మాన్‌ధన్ స్కీమ్‌లో చేసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత ఈ స్కీమ్ కింద పెన్షన్ అందుతుంది. 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వరకు ఏ రైతు అయినా ఈ పథకంలో చేరొచ్చు. దీని కింద.. రైతు నెలవారీ పెన్షన్ రూ.3000 వరకు పొందుతాడు.
కావాల్సి పత్రాలు
1. ఆధార్ కార్డ్ 2. గుర్తింపు కార్డు 3. వయస్సు సర్టిఫికెట్ 4. ఆదాయ ధృవీకరణ పత్రం 5. సర్వే నంబర్ 6. బ్యాంక్ ఖాతా పాస్ బుక్ 7. మొబైల్ నంబర్ 8. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
ఈ పథకం కింద నమోదైన వారు.. 60 ఏళ్ల తర్వాత వార్షిక పెన్షన్ రూ .36,000 పొందుతారు. దీని కోసం రైతులు రూ. 55 నుంచి రూ.200 వరకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మాన్‌ధన్‌లో కుటుంబ పెన్షన్ కూడా ఉంది. రైతు అకాల మరణం చెందితే జీవిత భాగస్వామికి పథకం వర్తిస్తుంది. ఆ తరువాత ఆమెకు 50 శాతం పింఛను అందుతుంది.
పీఎం కిసాన్ స్కీమ్ కింద.. ప్రభుత్వం ప్రతి ఏటా.. అర్హులైన రైతులకు రూ. 2,000 చొప్పున 3 విడతలుగా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా రైతు ఖాతాల్లో పడుతుంది. ఒకవేళ రైతులు మాన్‌ధన్ కింద ప్రీమియం చెల్లించాలనుకుంటే.. రిజిస్ట్రేషన్ సులభంగా జరుగుతుంది. మాన్‌ధన్ కింద చెల్లించాలని అనే ఆప్షన్ ఎంచుకుంటే... ప్రతి నెల ప్రీమియం చెల్లించాల్సిన డబ్బులు పీఎం కిసాన్ యోజన కింద వచ్చే డబ్బుల నుంచి కట్ అవుతాయి. ఇలా అయితే రైతుల తమ చేతులో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు.