Farmers March Updates: రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ - హరియాణా సరిహద్దుల్లో భారీగా పోలీసులు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సరిహద్దుల్ని ముళ్ల కంచెలు, బారికేడ్‌లతో నింపేశారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడా మార్చి 12వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగరంలో గుంపులు గుంపులుగా తిరగడాన్ని నిషేధించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాక్టర్‌లనీ నగరంలోకి అనుమతించడం లేదు. దీంతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్ క్యాన్స్, సోడా బాటిల్స్‌పైనా ఆంక్షలు విధించారు. లౌడ్ స్పీకర్‌లు వాడడానికీ వీల్లేదని తేల్చి చెప్పారు పోలీసులు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఇవీ డిమాండ్లు
రైతులు పండించే పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలని, దీనికి చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికులకు ఫించన్లు అందించాలని, లిఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని, రైతులపై కేసులను ఉపసంహరించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతోనే రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హర్యాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ధ పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను, బల్క్ ఎస్‌ఎంఎస్‌లను మంగళవారం దాకా నిషేదించింది. ఇకపోతే, రైతులు చేపట్టిన మార్చ్ నేపత్యంలో రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది.
ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే పోలీసులు ప్రజలకు సూచించారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్ని బారికేడ్‌లతో మూసేశారు. పార్లమెంటరీ బలగాల్లోని 50 సంస్థలు రంగంలోకి దిగి భద్రత అందిస్తున్నాయి. రైతులు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతు నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీనే భేటీ అయ్యేందుకు కేంద్రం ఆహ్వానం పంపిందని కొందరు రైతు నాయకులు వెల్లడించారు. కేంద్రమంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల నేతలో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు మంత్రులు ఫిబ్రవరి 8వ తేదీన ఓసారి సమావేశమయ్యారు. రైతుల సమస్యలపై చర్చించారు.
Also Read: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కి మరో దెబ్బ, సీనియర్ నేత అశోక్ చవాన్ రాజీనామా