Ashok Chavan Quits Congress: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (Ashok Chavan) పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టనుంది. అయితే...అశోక్ చవాన్ బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. భోకర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ చవాన్...స్పీకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. ఆయన బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కి ఇది రెండోషాక్‌ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దియోర గత నెల పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఏక్‌నాథ్‌ శిందే వర్గమైన శివసేనలో చేరారు. ఆ తరవాత మరో నేత బాబా సిద్దిఖీ పార్టీకి రాజీనామా చేసి అజిత్ పవార్ వర్గంలో చేరారు. నిజానికి చాలా రోజులుగా అశోక్ చవాన్ బీజేపీలో చేరతారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. 







అశోక్ చవాన్‌ రాజీనామాపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఏం జరుగుతుందో వేచి చూడండి అని వెల్లడించారు.


"అశోక్ చవాన్ రాజీనామా చేసినట్టు ఇప్పుడే తెలిసింది. ఆయనే కాదు. కాంగ్రెస్‌లోని కొంత మంది నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. ప్రజల మద్దతున్న నేతలంతా కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నారు. కచ్చితంగా కీలక నేతలంతా బీజేపీలో చేరతారన్న నమ్మకముంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మీరే వేచి చూడండి"


- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌తోనే..


విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించిన అశోక్ చవాన్ కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం సేవలందించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా ఇలా అన్ని కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే... Adarsh Housing Society  స్కామ్‌ ఆరోపణలతో 2009లో ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేసిన అశోక్ చవాన్‌ ఉన్నట్టుండి ఆ పార్టీని వీడడం సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్‌ పేరిట కాంగ్రెస్ నేతల్ని బెదిరించి తమ వైపు లాక్కుంటున్నారని ఆరోపించారు. బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోల్చుతూ మండి పడ్డారు.