Family 'sad and happy' over recovery of mortal remains of soldier after 56 years: 1968 నాటి విమాన ప్రమాదంలో మరణించిన కేరళ సైనికుడి మృతదేహాన్ని సైన్యం వారి కుటుంబానికి అందించనుంది. ఆ ప్రమాదంలో మొత్తం 102 మంది చనిపోయారు. అప్పట్లో ఆ ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించ లేకపోయారు. 2003లో డోగ్రా స్కౌట్స్‌ ప్రమాద స్థలాన్ని గుర్తించారు. అప్పటి నుంచి చనిపోయిన వారి కోసం గాలిస్తున్న డోగ్రా స్కౌట్స్‌ ఇప్పటివరకూ 9 మంది మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అందించింది.


2003 నుంచి మారథాన్ ఆపరేషన్‌:


1968లో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఒక విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహటంగ్ పాస్ సమీపంలో కూలిపోయింది. చంఢీగడ్‌ నుంచి లేహ్‌కు వెళ్తున్న ఆ విమానంలో కేరళకు చెందిన సైనికుడు థామస్ చెరియన్‌తో పాటు 102 మంది ప్రయాణిస్తున్నారు. AN-12గా పిలిచే ఆ ఎయిర్‌ క్రాప్ట్‌ ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌ క్రాఫ్ట్‌. ఆ విమానం 1968 ఫిబ్రవరి 7న రోహటంగ్ పాస్ సమీపంలో మిస్‌ అయింది. దశాబ్దాల పాటు ఆ విమానం ఆచూకీ ఆ హిమాలయ సానువుల్లో కనిట్టలేకపోయారు. అయితే సైన్యంలోని ఒక భాగమైన అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మౌంటేనీరింగ్ సంస్థకు చెందిన వాళ్లు 2003లో మొట్టమొదటిసారి AN-12 శిథిలాలను గుర్తించారు. అప్పటి నుంచి డోగ్రా స్కౌట్స్‌తో కలిసి తిరంగా మౌంటేన్ రెస్క్యూ టీమ్ సంయుక్తంగా ఆ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల గాలింపును ముమ్మరం చేశారు. 2003 నుంచి కొనసాగుతున్న ఈ మారథాన్ ఆపరేషన్‌లో 2019 వరకు ఐదుగురి మృతదేహాలే లభ్యమయ్యాయి. 2005, 2006,2013, 2019లో మొత్తంగా ఐదుగురి మృతదేహాలను మంచు పర్వతాల్లో వెలికితీశారు. ఇప్పుడు నలుగురి శవాలు దొరకగా.. ఆ సంఖ్య 9కి చేరింది. మరో 93 మృతదేహాలు దొరకాల్సి ఉంది. చంద్ర భగ పర్వతంపై వీరందరినీ కనిపెట్టినట్లు సైన్యం తెలిపింది. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుందని సైన్యం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నలుగురు మృతదేహాలు దొరకడంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు చివరి సంస్కారాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడినట్లు తెలిపారు.






56 ఏళ్ల తర్వాత అంతిమ సంస్కారాలు:


తమ ప్రియమైన అన్నయ్య పార్థివ దేహం 56 ఏళ్ల తర్వాత సైన్యం వెలికి తీసి ఇస్తుండడం గొప్పగా అనిపిస్తోందని కేరళకు చెందిన థామస్‌ చెరియన్ కుటుంబ సభ్యులు తెలిపారు. చెరియన్ చనిపోయినప్పటికి తన వయస్సు 12 సంవత్సరాలుగా చెప్పిన ఆయన సోదరి.. సైన్యం నుంచి ఎప్పుడు వచ్చినా తమ కోసం చాలా బొమ్మలు తెచ్చేవాడని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 56 ఏళ్ల తర్వాతైనా తమ అన్నయ్యకు అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం కల్పించిన సైన్యానికి చెరియన్ సోదరి, తమ్ముడు కృతజ్ఞతలు తెలిపారు. చెరియన్ సొంత ఊరు పత్తనమిట్టలోని ఎలత్తూర్‌. అక్కడే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ దేవుడి కృప వల్లే తమకు కనీసం ఈ పాటి అదృష్టమైన దక్కుతోందన్నారు. అయితే తమ అన్నయ్య ఫొటో ఒక్కటి కూడా తమ వద్ద లేదని చెప్పిన చెరియన్‌ కుటుంబ సభ్యులు ,సైన్యం తమ రికార్డుల నుంచి ఒకటి ఇప్పించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.