వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.. ఏదో ఒక గ్రూప్‌లో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు. తెలియకుండానే వాటిని మళ్లీ ఫార్వార్డ్ చేస్తాం. కానీ ఇందులో ఒక్కోసారి చాలా సున్నితమైన, న్యాయవ్యవస్థకు, దేశ భద్రతకు, శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించే వార్తలు కూడా వస్తాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తాజాగా ఈ వార్త కూడా వాట్సాప్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో చూద్దాం.
ఇదే మెసేజ్..
రానున్న 9 ఏళ్లకు గాను అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. 193 ఓట్లకు గాను ఆయనకు 183 ఓట్లు వచ్చాయి.
71 ఏళ్లుగా ఈ స్థానం గ్రేట్ బ్రిటన్ చేతిలోనే ఉంది.
ఇది జోధ్‌పుర్, భారత్‌కు గర్వించదగ్గ విషయం.
నిజమెంత?
ఇది పక్కా ఫేక్ న్యూస్. ఎందుకంటే అసలు అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో చీఫ్ జస్టిస్ అనే స్థానమే లేదు. అక్కడ కేవలం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు.
అమెరికాకు చెందిన జస్టిస్ జోన్ డోనహ్యూ ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో ఆమెను ఈ స్థానానికి ఎన్నుకున్నారు. 2010 నుంచి జస్టిస్ జోన్ డోనహ్యూ ఆ కోర్టులో సభ్యురాలిగా ఉన్నారు.
జస్టిస్ దల్వీర్ సంగతేంటి?
జస్టిస్ దల్వీర్ భండారీ కూడా అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో 2012 నుంచి సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2017 నవంబర్‌లో మరోసారి సభ్యుడిగా (ప్రెసిడెంట్‌గా కాదు) ఎన్నికయ్యారు. 9 ఏళ్ల పాటు ఆ స్థానంలో ఉండేందుకు 2018 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
ఈ ఓట్లు ఏంటి?
'193 ఓట్లకు 183 వచ్చాయి' అని చెబుతున్నారు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూద్దాం. 2017లో జస్టిస్ దల్వీర్ భండారీ, యూకేకు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్‌ను ఐసీజేలో సభ్యులుగా ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిగింది. అయితే చివరి నిమిషంలో జస్టిస్ క్రిస్టోఫర్ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే జనరల్ అసెంబ్లీలో జస్టిస్ దల్వీర్ భండారీకి 193 ఓట్లకు గాను 183 వచ్చాయి. సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఉన్న 15 ఓట్ల ఆయనకే వచ్చాయి. కనుక ఈ ఓట్లకు ఐసీజే ప్రెసిండెంట్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఐసీజే మెంబర్‌గా మాత్రమే జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు.
ఇంకో విషయం..
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అది కూడా సీక్రెట్ బ్యాలెట్ రూపంలో జరుగుతుంది. ఐసీజేలో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. కనుక 15 మందికి వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోన్న 193 ఓట్లకు సంబంధం లేదు.
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవీకాలం మూడేళ్లు కాగా, ఐసీజేలో సభ్యులకు 9 ఏళ్ల పదవీ కాలం ఉంది. కనుక ఆ వైరల్ మేసేజ్ ఫేక్ న్యూస్.