Eastern Zonal Council Meet:


కోల్‌కత్తాలో అమిత్ షా 


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, సిక్కిం ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. Eastern Zone Councilలో భాగంగా కీలక అంశాలు చర్చించనున్నారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఈ మీటింగ్ జరగనుంది. ఇప్పటికే అమిత్‌షా అక్కడికి చేరుకున్నారు. ఈ రాష్ట్రాలన్నీ ఈస్టర్న్ జోన్ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయి. అయితే...ఈ రాష్ట్రాల్లోని భద్రత, స్మగ్లింగ్, అంతర్గత
వాణిజ్యం సహా...భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో నెలకొన్న పరిస్థితులనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. నిన్న సాయంత్రమే అమిత్ షా కోల్‌కత్తా వెళ్లారు. బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు బదులుగా డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదర్ వెళ్లనున్నారు. నిజానికి..కేంద్రం ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించినా నితీష్ కుమార్ వాటికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన G20 సమావేశానికీ హాజరు కాలేదు నితీశ్. ఆ తరవాత నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ముందే అమిత్‌షా పార్టీ నేతలతో చర్చలు జరిపారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. 






ఈశాన్య రాష్ట్రాలకు మోడీ..


అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్, చైనా సైనికుల మధ్య తవాంగ్‌లో ఘర్షణ జరిగిన నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌కు మోడీ వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మేఘాలయాలోని షిల్లాంగ్‌ ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మతో పాటు ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. మేఘాలయాతో పాటు త్రిపురలోనూ ప్రధాని మోడీ పర్యటించనున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ రాష్ట్రంలో పలు పథకాలు
ప్రారంభించనున్నారు ప్రధాని. ఎమ్మెల్యేలను కలవడంతో పాటు బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇటీవలే తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదే అని వాదిస్తున్న చైనా పదేపదే ఇలా కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతోంది. చైనాకు గట్టి బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది. 


Also Read: One House Two States: ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదండోయ్ - వంటగది తెలంగాణలో ఉంటే పడకగది మహారాష్ట్రలో ఉంది!