One House Two States: ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదండోయ్. ఎందుకు అనుకుంటున్నారా... ఆ ఇంటి వంటగది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే పడకగది మాత్రం మహారాష్ట్రలో ఉంది. ఇదేంటి ఒక రాష్ట్రంలో కిచెన్, మరో రాష్ట్రంలో బెడ్ రూం... అంతా అబద్ధం అనుకుంటున్నారు కదా. నిజమండీ. ఆ ఇల్లు సగ భాగం తెలంగాణలో ఉంటే మరో సగ భాగం మాహారాష్ట్రలో ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఇల్లు స్టోరీఏంటి , రెండు రాష్ట్రాలకు చెందినది ఎలా అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న చంద్రాపూర్ జిల్లా సిమావర్తి జీవతి తహసీల్ పరిధిలోని మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. మొత్తం 8 గదులు ఉండగా... ఇందులో నాలుగు గదులు తెలంగాణలో, మరో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉన్నాయి. వంటగది తెలంగాణలో ఉండగా, పడక గది, హాలు మాత్రం మహారాష్ట్రలో ఉన్నాయి.
1969లో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. అయితే దీన్ని అధికారికంగా పరిష్కరించనప్పటికీ మళ్లీ సమస్య ఏర్పడింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గీశారు. దీంతో ఈ ఇల్లు సగభాగం తెలంగాణలో, మరోసగం మహారాష్ట్రలో కలిసింది. సుద్దముక్కతో గీసి మరీ ఈ ఇంటికి సరిహద్దును గీశారు. ప్రస్తుతం ఈ ఇంట్లో మొత్తం 13 మంది సభ్యులు ఉంటున్నారు. కుటుంబ పెద్ద ఉత్తమ్ పవార్ తమ ఇంటి స్పెషాలిటీ గురించి మాట్లాడారు.
ఇలా తమ ఇల్లు రెండు రాష్ట్రాలకు చెందడం వల్ల తమకు ఎలాంటి సమస్యా రాలేదని ఉత్తమ్ పవార్ వివరించారు. తాము రెండు రాష్ట్రాల్లో ఆస్తి పన్నులు చెల్లిస్తున్నట్లు.. అలాగే రెండు రాష్ట్రాల పథకాలను తాము వినియోగించుకున్నట్లు చెప్పారు. అలాగే ఆ ఇంట్లో వాహనాలకు రెండు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉండటం గమనార్హం. అయితే ఈ వార్త తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సెకన్లలో ప్రయాణం చేయొచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి రెండు రాష్ట్రాల పథకాలను ఏక కాలంలో అనుభవిస్తున్న అదృష్ట కుటుంబం అంటూ మరో వ్యక్తి తెలిపాడు.
14 గ్రామాల కోసం ఇరు రాష్ట్రాల గొడవ...
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని 14 గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతోంది. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు... ఈ 14 గ్రామాలను ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే కలుపుకోవచ్చని ప్రకటించారు. కానీ గ్రామస్థులు మాత్రం ఇందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఈ 14 గ్రామాల క్లస్టర్ లో మహారాజ్ గూడ, ముకడంగూడ, పారండోలి, పారండోలి తండా, కోత, లెండిజాల, శంకర్ లోడి, పద్మావతి, అంతాపూర్, ఇందిరానగర్, యేసాపూర్, పలాసగూ, భోలాపత్తర్, లెండిగూడ ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు మహారాష్ట్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తెలంగాణ మాత్రం ఆ గ్రామాలు తమవేనని వాదిస్తున్నాయి.