Plane Crash in Nepal: ఖాట్మండు ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన విమాన ప్రమాదం అంతర్జాతీయంగా సంచలనమైంది. పైలట్ మినహా 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా ఫ్లైట్ కుప్ప కూలింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. పైలట్ ఒక్కడే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మిగతా ప్రయాణికులంతా అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే..ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి దీనిపై విచారణ జరుగుతోంది. ప్రత్యక్ష సాక్షులు కొందరు ప్రమాదానికి ముందు ఏం జరిగిందో వివరించారు. ముందు భారీ శబ్దం వినిపించిందని, టైర్‌ పేలిందని అనుకుని పట్టించుకోలేదని చెప్పారు. కానీ ఆ తరవాత ఉన్నట్టుండి పెద్ద ఎత్తున పొగ రావడం వల్ల అనుమానం వచ్చిందని తెలిపారు. ఆ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనిస్తే విమానం కుప్ప కూలినట్టు అర్థమైందని వివరించారు. 


"నేను గ్యారేజ్‌లో పని చేసుకుంటున్నాను. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. టైర్ పేలి ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ తరవాత పొగలు కమ్ముకున్నాయి. వెళ్లి చూస్తే విమానం కుప్ప కూలిపోయి ఉంది. అది ఓ కంటెయినర్‌ని ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే అది అలానే జారుతూ వచ్చి పక్కనే ఉన్న ఇళ్లను ఢీకొట్టేది. ఆ కంటెయినరే మా ప్రాణాలు కాపాడింది"


- ప్రత్యక్ష సాక్షి







ఈ ప్రమాదంలో పైలట్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 18 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా మిగతా ముగ్గురు  హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే...స్థానికులు కొందరు ఇదేదో రోడ్ యాక్సిడెంట్ అనుకున్నామని, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ఊహించలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నేపాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 


"ఉన్నట్టుండి మాకు పెద్ద శబ్దం వినిపించింది. రోడ్‌పైన ఏదో యాక్సిడెంట్ జరిగి ఉంటుందని అనుకున్నాం. కానీ ఆ తరవాతే తెలిసింది విమానం కూలిపోయిందని. టేకాఫ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వేపై కుప్ప కూలింది. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే మంటలు ఎగిసి పడుతున్నాయి. మేం అక్కడికి వెళ్లిన సమయానికి మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది"


- ప్రత్యక్ష సాక్షి 


 






Also Read: Donald Trump: సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్, ఇకపై ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్ - దాడి ఎఫెక్ట్