US Election 2024: ఇటీవలే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల క్యాంపెయిన్ చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే..ఇక్కడో ట్విస్ట్ ఉంది. కేవలం ఔట్‌డోర్ క్యాంపెయిన్‌కి ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు ట్రంప్. కేవలం ఇన్‌డోర్స్‌లో మాత్రమే ప్రచారం చేస్తారు. అది కూడా భారీ భద్రత మధ్య. ఇటీవల పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. కుడి చెవిపై నుంచి బులెట్ దూసుకుపోవడం వల్ల స్వల్ప గాయమైంది. చికిత్స తీసుకున్న ట్రంప్ వెంటనే కోలుకున్నారు. అయితే...ఇకపై ప్రచారం చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించనున్నారు.
బహిరంగ వేదికల్లో కాకుండా చిన్న స్టేడియంలలో క్యాంపెయిన్ చేయనున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ వందలాది భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ ఔట్‌డోర్‌లో జరిగినవే. పైగా ఈ అన్ని క్యాంపెయిన్‌లకూ భారీ స్పందన వచ్చింది. కానీ మొన్న జరిగిన దాడితో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. భద్రతా వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తడం వల్ల సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా చేశారు.
ఒక్కసారిగా మారిన రాజకీయాలు..
Washington Post రిపోర్ట్ ప్రకారం ట్రంప్ టీమ్ సీక్రెట్ సర్వీస్‌కి ఓ రిక్వెస్ట్ పెట్టుకుంది. ఎన్నికల ప్రచారాన్ని ఇంకా విస్తృతం చేస్తారని, భారీ ఎత్తున సెక్యూరిటీ కావాలని అడిగింది. కానీ...భద్రత కల్పించేందుకు నిధులు లేవని సీక్రెట్ సర్వీస్ స్పష్టం చేసింది. ఈ రిక్వెస్ట్‌ని పక్కన పెట్టింది. ఈ ఘటన తరవాత అమెరికాలో రాజకీయాలు మారిపోయాయి. అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ వచ్చారు. ట్రంప్‌పై పోరాడి కచ్చితంగా గెలుస్తానని చాలా ధీమాగా చెబుతున్నారు. చాలా రోజులుగా బైడెన్ ఆరోగ్యంపై వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన ప్రెసిడెంట్ పదవికే పనికి రారని ట్రంప్ తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే బైడన్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. వేదికపై సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. నడవడానికీ ఇబ్బంది పడుతున్నారు.
ఈ మధ్య ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పటి నుంచి విమర్శలు ఇంకా పెరిగాయి. ఆ తరవాత వెంటనే ఆయనకు కొవిడ్ సోకింది. వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తరవాత రెండు రోజులకే సంచలన ప్రకటన చేశారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అయితే...ట్రంప్‌కి ఇప్పటికే మద్దతు పెరుగుతోంది. పలు సర్వేలూ ఆయనకే మొగ్గు చూపుతున్నాయి. కానీ కమలా హారిస్ రాకతో ఈ అంచనాలు ఏమైనా మారతాయా అన్నదే ఆసక్తికరంగా మారింది. కమలా మాత్రం తన గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు.
Also Read: Salman Khan: నన్ను చంపేందుకు కుట్ర జరిగింది, సల్మాన్ ఖాన్ సంచలన స్టేట్‌మెంట్