Lawrence Bishnoi Vs Salman Khan: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనను చంపేందుకు చూశాడని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకే ఇంటి ముందు కాల్పులు జరిపించాడని చెప్పాడు. తనతో పాటు తన కుటంబం మొత్తాన్ని హత్య చేయాలని చూసినట్టు వివరించాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కి ఈ వివరాలు వెల్లడించాడు. పోలీసులు సల్మాన్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. గత నెలలోనే పోలీసులు ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, పదేపదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సల్మాన్ చెప్పాడు.
ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన కొందరు వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపారు. ఈ ఘటన ముంబయిలో సంచలనం సృష్టించింది. సల్మాన్‌ని చాలా రోజుల నుంచి టార్గెట్‌గా పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. అటు లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్‌ని హత్య చేయాలని చూసినట్టు ఒప్పుకున్నాడు. బాంద్రాలోని గ్యాలక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పులు జరిగినట్టు పోలీసులకు సల్మాన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో మొత్తం 17 వందల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇందులో ఎన్నో కీలక విషయాలున్నాయి.
గత నెల సల్మాన్ ఖాన్‌ని చంపేందుకు ప్లాన్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. సల్మాన్‌ని ఎవరు చంపితే వాళ్లకి రూ.25 లక్షల నజరానా ఇస్తామని చెప్పింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని చంపినట్టే సల్మాన్‌నీ కాల్చి చంపాలని పురమాయించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో కాల్పులు జరపాలని డిసైడ్ అయ్యారు. అంతే కాదు. ఈ అటాక్ కోసం ప్రత్యేకంగా పాకిస్థాన్ నుంచి AK47 గన్స్ తెప్పించారు. వీటితో పాటు మరి కొన్ని తుపాకులూ తెచ్చుకున్నారు. రెక్కీ నిర్వహించే సమయంలో దాదాపు 70 మంది సల్మాన్ కదలికలపై నిఘా పెట్టారు. ఆయన ఫార్మ్‌హౌజ్‌తో పాటు Goregaon Film City పైనా నిఘా పెట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బైక్‌పైన వచ్చిన ఇద్దరు దుండగులు సల్మాన్ ఖాన్ అపార్ట్‌మెంట్‌పై పలు రౌండ్‌ల కాల్పులు జరిపారు. ఆ తరవాతే బిష్ణోయ్ గ్యాంగ్ ఈ పని చేసినట్టు తెలిసింది. ఎన్నో రోజులుగా సల్మాన్‌ని మట్టుబెట్టాలని చూస్తున్నాడు బిష్ణోయ్. ఈ కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట సల్మాన్ హాజరయ్యాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని వాంగ్మూలం ఇచ్చాడు. తనతో పాటు కుటుంబ సభ్యుల్నీ హత్య చేయాలని చూస్తున్నారని చెప్పాడు.
"గతంలో ఓ ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ నన్ను హత్య చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. నాతో పాటు నా బంధువులనూ చంపేందుకు కుట్ర జరిగింది. తన గ్యాంగ్‌లోని సభ్యులతో నా ఇంటిపై కాల్పులు జరిపించాడు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు"
- సల్మాన్ ఖాన్