Hyderabad Latest News: హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల పైన వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే, పసి పిల్లలను కూడా కుక్కలు చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు తమ పిల్లలను రోడ్లపై ఆటలకు పంపేందుకు సైతం జంకుతున్నారు. ఎటు వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు.


‘‘మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? అయితే, టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయి’’ అని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.






ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు సమాచారం ఉందని ఈ మధ్యే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. తెలంగాణలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు కరుస్తు్న్న ఘటనలు జరుగుతున్నాయని వీటిని నియంత్రించాలని ఈ మధ్యే ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. భారత జంతు సంక్షేమ సంఘం గైడ్ లైన్స్ ఏమాత్రం ఆచరణయోగ్యంగా లేవని.. ప్రజల ప్రాణాల కన్నా కుక్కల ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. కుక్కలను మానవతా దృక్పథంతో చూడాలని అనడంలో అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణలో ప్రమాదకరంగా ఉన్న ఈ వీధి కుక్కలను నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరింది.


సీఎం రేవంత్ సమీక్ష
వీధి కుక్కలు పిల్లల్ని కరుస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ఇటీవల హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై గత సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష కూడా చేశారు.