నూతన సాగు చట్టాలపై రైతులు మొదలు పెట్టిన ఉద్యమానికి నేటికి ఏడాది పూర్తయింది. ఏడాది సాగిన ఉద్యమానికి తలొగ్గి మోదీ సర్కార్ ఆ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సాగు చట్టాలను రద్దు ప్రక్రియ పార్లమెంటులో పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అంతేకాకుండా కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్పీ)పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.


రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సీనియర్ నేత రాకేశ్ టికాయత్.. ఏబీపీ న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యమం ఎప్పుడు విరమిస్తారు, లఖింపుర్ ఖేరీ ఘటన సహా పలు విషయాలపై మాట్లాడారు.


ఉద్యమం మొదలైన నాడు కనీస మద్దతు ధర ప్రస్తావనే రాలేదు కదా? మరి ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ఇది ఎందుకు తెరపైకి వచ్చింది?


టికాయత్: MSP గురించి గత 15 ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. 2011లోనే నరేంద్ర మోదీ దీని గురించి మాట్లాడారు. సాగు చట్టాల ఉద్యమం మొదలైనప్పటి నుంచే కనీస మద్దతు ధర గురించి డిమాండ్ చేస్తున్నాం. 


'ప్రతిపక్షంలో ఎవరున్నా సరే భాజపా ఓడిపోవాలి' అనే నినాదాన్ని ఇచ్చారు కదా? ఇది చూస్తుంటే మీ పోరాటం రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాకుండా భాజపాకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఉంది కదా?


టికాయత్: అలాంటిదేం లేదు. రైతులకు అందరూ సమానమే. కానీ రైతు సమస్యలపై చర్చించకపోతే వారిపై పోరాటం చేస్తాం. 


లఖింపుర్ ఘటనలో చనిపోయిన రైతు కుటంబాలకు పరిహారంపై టికాయత్‌తో సంప్రదించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇంకేంటి సమస్య?


టికాయత్: లఖింపుర్ హింసాత్మక ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం దక్కలేదు. అదొక్కటే కాదు ఈ ఉద్యమం జరిగిన సమయంలో చనిపోయిన 750 మంది రైతుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. 


సాగు చట్టాల రద్దును మాస్ట్రర్ స్ట్రోక్‌గా భావించవచ్చా? లేక ఇది టికాయత్ సహా రైతుల విజయమా?


టికాయత్: ఇది ఏ ఒక్కరి విజయం లేక అపజయంగా మేం చూడటం లేదు. ఇవి కేవలం రైతుల సమస్యలు.. అవి ప్రస్తుతం పరిష్కారం దిశగా సాగుతున్నాయి.


ఎమ్ఎస్‌పీని పక్కన పెడితే రైతులు ఉద్యమం విరమించాలంటే ఇంకేం డిమాండ్లు ఉన్నాయి?


టికాయత్: కనీస మద్దుత ధర (ఎమ్‌ఎస్‌పీ) డిమాండ్ మా ఉద్యమంలో భాగం. అది కాకుండా రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. ఎమ్‌ఎస్‌పీకి అనుగుణంగా రైతుల పంటను కొనాలి.


లఖింపుర్ ఘటనలో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు?


టికాయత్: భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 120B సెక్షన్ కింద అజయ్ మిశ్రా నిందితుడిగా ఉన్నారు. లఖింపుర్ హింసాత్మక ఘటనకు అజయ్ మిశ్రా పురిగొల్పితే ఆశిష్ మిశ్రా ప్లాన్ చేశారు. 






Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'


Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి