Siddharth Chatterjee Yoga in China: భారత మాజీ సైనికాధికారి చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గడ్డకట్టుకుపోయే చలిలో యోగా చేశారు సిద్ధార్థ్ ఛటర్జీ. అంతే కాదు. అక్కడ ప్రాణాయామం కూడా చేశారు. ఈ యోగా, ప్రాణాయామమే (Siddharth Chatterjee) తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. చైనాలో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న సిద్ధార్థ్ ఈ మధ్యే ప్రాణాయామానికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. కొవిడ్ సహా ఇతరత్రా వైరస్‌ల నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ఈ వ్యాయామం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. ఇప్పుడీ వీడియోనే చైనా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంత చలిలో బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ ఎలా చేస్తున్నారో అంటూ ఆశ్చర్యపోతున్నారు.






Breathing for Good Health పేరుతో ఈ వీడియో పోస్ట్ చేశారు సిద్ధార్థ్ ఛటర్జీ. ఓంకార నాదంతో వీడియో ప్రారంభమైంది. బీజింగ్‌లో గడ్డ కట్టుకుపోయిన సరస్సు తీరంలో చొక్కా లేకుండా యోగా చేశారు. అక్కడే ప్రాణాయామం చేశారు. ఆ తరవాత శీర్షాసనం వేశారు. 60 ఏళ్ల వయసులో ఆయన ఇలా చేయడమే ఆసక్తికరంగా మారింది. 2020లో చైనాలో అపాయింట్‌ అయిన సమయంలో కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబెసిటీ తదితర సమస్యలతో బాధ పడేవారు సిద్ధార్థ్ ఛటర్జీ. చలిలో ఎక్కువగా తిరగడం, ఉపవాసం ఉండడం, ప్రాణాయామం చేయడం లాంటి వ్యాయామాలతో దాదాపు 25 కిలోలు తగ్గారు. ఇలా చేయడం వల్లే అటు శారీరకంగానే కాకుండా మానసికంగా చురుగ్గా అయినట్టు వివరించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో బంగ్లాదేశ్ నుంచి కోల్‌కత్తాకి వలస వెళ్లింది సిద్ధార్థ్ ఛటర్జీ కుటుంబం. మూడేళ్ల వయసులో పోలియోతో ఇబ్బంది పడ్డారాయన. బాల్యం చాలా కష్టంగా గడిచింది. ఆ తరవాత మిలిటరీలో చేరారు. Para Regimentలో విధులు నిర్వర్తించారు. 1981లో National Defence Academyలో చేరారు. 


 






Also Read: Ram Navami Surya Tilak 2024: బాల రాముడి సూర్య తిలకాన్ని చూసి ప్రధాని భావోద్వేగం, చరిత్రాత్మకం అంటూ పోస్ట్