Ayodhya Surya Tilak 2024: అయోధ్య రామ మందిరంలో సూర్య తిలక దర్శనం (Ram Navami Surya Tilak 2024) భక్తుల్ని పరవశంలో ముంచేసింది. బాల రాముడి ఆలయంలో తొలిసారి రామ నవమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగానే ఈ అపూర్వ ఘట్టం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12.01 నిముషాలకు రాముడి నుదుటిన సూర్య కిరణాలు ప్రసరించాయి. దాదాపు 3-4 నిముషాల పాటు ఈ తిలకం దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆలయం అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారు మోగింది. ఈ అద్భుతాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అసోంలోని నల్బరీలో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ట్యాబ్‌లో ఈ వీడియో చూశారు మోదీ. ఆ తరవాత X వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయోధ్యలో రామ నవమి జరగడం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ సూర్య తిలకం దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు. 


"నల్బరీలో ర్యాలీలో పాల్గొన్న తరవాత ఈ సూర్య తిలకం దర్శనం చేసుకున్నాను. అయోధ్య రాముడిపై సూర్య కిరణాలు పడిన ఆ అపూర్వ ఘట్టాన్ని వీక్షించాను. కోట్లాది మంది ప్రజలతో పాటు నాకూ ఇది చాలా భావోద్వేగమైన క్షణం. అయోధ్యలో రామ నవమి వేడుకలు జరగడం నిజంగా చరిత్రాత్మకం. మన జీవితాల్లోకి ఈ సూర్య తిలకం కొత్త శక్తినివ్వాలని, మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ






సూర్య తిలకాన్ని చూస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రజలందరూ ఈ అద్భుతాన్ని కచ్చితంగా చూడాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న సమయంలో సూర్య తిలకం గురించి ప్రస్తావించారు. సెల్‌ఫోన్‌లలో టార్చ్ లైట్ ఆన్ చేసి అదే సూర్యుడికి తిలకంగా భావించాలని అన్నారు. ఆ తరవాత జై శ్రీరామ్ అంటూ నినదించారు.