Premalu Movie: ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వగానే దానిలో నుంచి ముఖ్యమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని వల్ల సినిమాలపై నెగిటివ్ ప్రభావం పడుతోంది. ‘ప్రేమలు’ విషయంలో కూడా అదే జరిగింది. మీమ్స్, రీల్స్‌లో ఎక్కడ చూసినా ప్రేమలు మూవీ క్లిప్స్ ఉంటున్నాయి. మూవీలో కీలకమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ క్లిప్స్ మూవీపై అంచనాలు పెంచినా.. ముందుగానే సీన్స్ చూసేయడం వల్ల ప్రేక్షకులకు ఆ ఫీల్ రావడం లేదనేది టాక్. అందుకే థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ‘ప్రేమలు’.. ఓటీటీలో విడుదల అవ్వగానే చాలామంది దీనిని ఓవర్ రేటెడ్ అంటున్నారు.
ఒకట్రెండు సీన్స్ వల్లే..
‘ప్రేమలు’ ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. అంతకు మించి ఆ సినిమా నుంచి ఏది ఎక్కువగా ఆశించకూడదు. అయినా కూడా ఒక రిఫ్రెషింగ్ సినిమాగా ‘ప్రేమలు’ చాలామందిని ఆకట్టుకుంది. మలయాళ మేకర్స్‌కు అసలు ఈ మూవీని తెలుగులో విడుదల చేసే ఆలోచనే లేకపోయినా ప్రేక్షకుల రెస్పాన్స్‌ను చూసి తెలుగు నిర్మాతలు డబ్బింగ్ రైట్స్ కోసం క్యూ కట్టారు. అలా చాలారోజుల వెయిటింగ్ తర్వాత ‘ప్రేమలు’ తెలుగులో విడుదలయ్యింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఈ మూవీలోని కీలకమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ మొత్తం బయటకు వచ్చేశాయి. దీంతో థియేటర్లకు వెళ్లి ‘ప్రేమలు’ చూడని ఆడియన్స్ అంతా ముందుగానే ఆ సీన్స్ చూసేయడం వల్ల.. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌కు కనెక్ట్ కాలేకపోతున్నారు. క్లైమాక్స్ ముందుగానే తెలిసిపోవడం వల్ల.. భావోద్వేగ సన్నివేశాలకు కనెక్ట్ కాలేకపోెతున్నారు. అందుకే, అంతా సోసోగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్..
థియేటర్లలో ఒక సినిమా విడుదల అవ్వడం.. పెద్ద స్క్రీన్‌పై దానిని విజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వారికి అది విపరీతంగా నచ్చడం.. చివరికి ఓటీటీలో విడుదల అవ్వగానే దానిని ఓవర్ రేటెడ్ అంటూ విమర్శించడం.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే తంతు కొనసాగుతోంది. గత కొన్ని నెలల్లో థియేటరల్లో బ్లాక్‌బస్టర్ అయిన పలు సినిమాలు.. ఓటీటీలోకి రాగానే ఓవర్ రేటెడ్ అంటూ నెగిటివ్ కామెంట్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందులో ‘ప్రేమలు’ కూడా ఒకటి. అంతే కాకుండా దీనికి రివర్స్‌లో కూడా జరుగుతోంది. ఒక మూవీ థియేటర్లలో విడుదలయిన మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అంటూ ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. అలా ఓటీటీలో వచ్చిన సినిమా చూసి దానికి అండర్ రేటెడ్ అనే ట్యాగ్‌ను తగిలిస్తున్నారు.
‘గామి’పై ఎఫెక్ట్..
‘ప్రేమలు’ థియేటర్లలో రన్ అవుతున్న సమయంలోనే ‘గామి’ కూడా విడుదలయ్యింది. మొదట్లోనే ‘గామి’కి మిక్స్‌డ్ టాక్ రావడంతో అందరూ ‘ప్రేమలు’కే ఓటేశారు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ‘ప్రేమలు’ ఓవర్ రేటెడ్ అని, ‘గామి’ అండర్ రేటెడ్ అని అనడం మొదలుపెట్టారు చాలామంది ప్రేక్షకులు. సినిమాలోని కీలకమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో బయటికి రావడం వల్ల సినిమాలకు చాలా నష్టం జరుగుతుందని, అందుకే ఒక మూవీని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవారు దానిని వీడియోలు తీయకుండా ఉంటే బాగుంటుందని మరికొందరు మూవీ లవర్స్ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అందుకున్న ‘ప్రేమలు’.. ఓటీటీలోకి వచ్చాక మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది.