Europe Temperature:
కార్చిచ్చులు, వడగాలులు..
వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురవడం లేదంటే...అసలు చినుకు జాడే లేకపోవటం చాలా చోట్ల సాధారణమైపోయింది. కొన్ని దేశాల్లో మాత్రం విపరీతమైన వేడి పెరుగుతోంది. చాన్నాళ్లుగా ఐరోపాలో వేడి గాలులు వీస్తున్నాయి. మధ్యలో కొద్ది రోజులు కాస్త వాతావరణం కుదుటపడినట్టు అనిపించినా..మళ్లీ యథాస్థితికి వచ్చేసింది. ఈ సారి వేడి గాలులు మరింత తీవ్రమయ్యాయి. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ లేనంత ఉష్ణోగ్రతలు ఐరోపాలో నమోదవుతున్నట్టు World Meteorological Organization నివేదిక వెల్లడించింది. ఇక మీదట కూడా ఇక్కడ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవుతాయని ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. వేడి గాలులు, కార్చిచ్చులు, వరదల ముప్పులు ముంచుకొచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఫలితంగా...యూరప్ ఆర్థికంగా, సామాజికంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. Climate in Europe రిపోర్ట్‌లో మరి కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది వేసవిలో యూకేలో రికార్డు స్థాయిలో తీవ్రమైన వడగాలులు వీచాయని, Alpine గ్లేషియర్స్ కరిగి పోతున్నాయని వివరించారు.
కరిగిపోతున్న మంచు..
"వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయో యూరప్‌ను చూస్తే అర్థమవుతోంది. తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం తీవ్రంగానే ఉంటోంది. గతేడాదిలాగే...ఈ సారి కూడా ఐరోపాలో చాలా ప్రాంతాలు వడగాలుల తాకిడికి అల్లాడిపోయాయి. కొన్ని చోట్ల కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి కొన్ని చోట్ల కార్చిచ్చులు కమ్మేస్తున్నాయి. గతేడాది వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ప్రాణష్టమూ సంభవించింది" అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతంతో పోల్చి చూస్తే ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరిగాయి..? మంచు ఎంత తొందరగా కరిగిపోతోంది..? లాంటి అంశాలనూ ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. Alpine గ్లేషియర్స్‌ని పరిశీలిస్తే...ఈ మూడు దశాబ్దాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 1997-2021 మధ్య కాలంలో 30 మీటర్ల మేర మంచు కరిగిపోయింది. ఫలితంగా...సముద్ర మట్టం పెరుగుతోంది. వరదలకూ కారణమవుతోంది. అయితే...కొన్ని ఐరోపా దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. 1999-2000 మధ్య కాలంలో కర్బన ఉద్గారాలు 31% మేర తగ్గిపోయినట్టు వివరించింది. 2030 నాటికి వీటిని 55% మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఐరోపా దేశాలు. ఇదే స్థాయిలో కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ వెళ్తే...ఈ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. కార్బన్ న్యూట్రల్ సొసైటీని సాధించడంలో ఐరోపా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరో కీలక విషయం ఏంటంటే...ఐరోపాలో వాతావరణ మార్పులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు చాలా పకడ్బందీగా ఉంటాయి. వీటి కారణంగానే..దాదాపు 75% మంది పౌరులు సురక్షితంగా ఉంటారని అంచనా. ఇంత చేస్తున్నప్పటికీ...ఒక్కోసారి వరదలు ముంచెత్తి ప్రాణనష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం అక్కడి వాతావరణం చాలా వేడెక్కడం వల్ల పౌరులను కాపాడుకునే పనిలో పడ్డాయి అన్ని ప్రభుత్వాలు.
Also Read: International Fleet Review: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం జపాన్ కు చేరుకున్న భారత నౌకలు