AP Employees News: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవటం శోచనీయమని అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం ఓ వినతి పత్రం ఇచ్చారు. డీఏ, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులు, పెన్షనర్లు ఎలా బతకాలని ఆ వినతిపత్రంలో రాశారు. సీఎస్ ను కలిసిన తర్వాత సోమవారం (జనవరి 1) ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని పెద్దలతో సమీక్ష ఏర్పాటు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వారికి చెల్లించకపోతే వారు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకూ నెరవేర్చలేదని బొప్పరాజు గుర్తు చేశారు. సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై ఇక ఉద్యోగులకు నమ్మకం ఏం ఉంటుందని అడిగారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. జిల్లా పరిషత్‌ల పరిధిలో ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా అమలు కావటం లేదని అన్నారు. మరోవైపు 12వ పీఆర్‌సీ ప్రకటించి 7 నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆ కమిషన్ ఛైర్మన్‌కు సీటు కేటాయించలేదని అన్నారు. సిబ్బంది కేటాయింపు కూడా వారికి జరగలేదని విమర్శించారు.