Emmanuel Macron: ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతకు ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్వయంగా ప్రకటన చేశారు. అసలు ఎందుకు ఇలా చేశారో తెలుసా?


ఇదీ సంగతి


ఫ్రాన్స్‌లో ఈ మధ్య అవాంఛిత గర్భధారణలు పెరిగిపోయాయి. అంతేకాకుండా జనాభా నియంత్రణ కూడా గాడి తప్పింది. వీటికి తోడు లైంగికపరమైన సాంక్రమిక వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. దేశంలో యువతకు ఉచితంగా కండోమ్‌లను అందించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని భావిస్తోంది.


ఫ్రాన్స్‌ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగికపరమైన సాంక్రమిక వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 30 శాతం పెరిగింది. ఈ వ్యాధుల నివారణతోపాటు జనాభా నియంత్రణలో కూడా ఈ నిర్ణయం చిన్న విప్లవంలా పనిచేస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ వ్యాఖ్యానించారు.


ఇలా పొందొచ్చు


2023 జనవరి నుంచే యువతకు ఉచిత కండోమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అన్ని ఫార్మసీల ద్వారా యువత ఉచిత కండోమ్‌లను తీసుకోవచ్చని ఫ్రాన్స్‌ సర్కారు వెల్లడించింది.


ఫ్రాన్స్‌ ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి పథకాలను తీసుకొచ్చింది. ఫ్రాన్స్‌ పౌరులు కండోమ్స్‌ కొనుగోలు చేస్తే వాటికయ్యే ఖర్చును ప్రభుత్వమే తిరిగి చెల్లించే విధంగా 2018లో ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో 26 ఏళ్ల లోపు మహిళలకు ఉచితంగా గర్భనిరోధక మాత్రలను అందజేసే పథకాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా 26 ఏండ్లలోపు మహిళలకు ఫ్రాన్స్‌లో ఉచితంగా లైంగిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అబార్షన్‌లు కూడా ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఈ పథకాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


తొలిసారి


సాధారణంగా పురుషులకు, మహిళలకు రెండు రకాల కండోమ్‌లు ఉంటాయి. అయితే మలేసియాకు చెందిన ట్విన్ కేటలిస్ట్ అనే కంపెనీ తొలిసారి యూనీసెక్సువల్ కండోమ్‌ను తయారు చేసింది. అంటే దీన్ని పురుషులు లేదా స్త్రీలు ఎవరైనా ఉపయోగించొచ్చు.


గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి వినియోగించే మెటీరియల్‌తో ఈ కండోమ్‌ను తయారు చేశారట. జాన్ టాంగ్ ఇంగ్ చించ్ అనే గైనాకాలజిస్ట్ ఈ కండోమ్‌ను తయారు చేశారు. ట్విన్ కేటలిస్ట్ అనే సంస్థలో జాన్ పనిచేస్తున్నారు.


మరింత సురక్షితం..


సాధారణ కండోమ్‌లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమని జాన్ అంటున్నారు. ఈ వాండలీఫ్ కండోమ్‌కు చిన్న పౌచ్ (సంచి) ఉంటుందట. దీనిని యోనిలోకి ఇన్సర్ట్ చేయాలి. అయితే సంభోగం సమయంలో కండోమ్ జారిపోకుండా ఉండేందుకు దీనికి రెండు వింగ్స్ లాంటివి ఇచ్చారు. ఇవి పొత్తకడుపు, తొడలను అంటుకుని ఉండటం వల్ల కండోమ్ జారిపోకుండా ఉంటుందట. దీని వల్ల సంభోగం సమయంలో డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ అవడం లేదా కండో స్లిప్ అవడం వంటివి జరగవని జాన్ చెబుతున్నారు.


Also Read: Mumbai School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా- ఇద్దరు విద్యార్థులు మృతి