Elon Musk Heads To China: ఇండియాలో టెస్లా మార్కెట్‌కి అంతా (Tesla in India) లైన్ క్లియర్ అయింది అనుకునేలోగా ఎలన్ మస్క్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారత్ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావాల్సి ఉన్నా అది కూడా రద్దైంది. త్వరలోనే ఇండియాకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు మస్క్. కానీ...ఇప్పుడు ఆయన చైనా మార్కెట్‌పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మార్కెట్ డల్ అయింది. టెస్లా కార్ల సేల్స్ చైనాలో బాగా పడిపోయాయి. అందుకే అక్కడి మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు చైనా వెళ్లారు మస్క్. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు. భారత్‌కి వస్తారనుకున్న ఆయన ఉన్నట్టుండి చైనాకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఎలన్ మస్క్ బీజింగ్‌లోని ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి. Full-Self Driving (FSD) సాఫ్ట్‌వేర్ ఉన్న కార్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు అనుమతి అడగనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ కోసం తీసుకున్న డేటాకి అప్రూవల్ కావాలని కోరనున్నారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
అయితే...ఇటీవలే X వేదికగా ఓ నెటిజన్ ఎలన్ మస్క్‌ని ఓ ప్రశ్న అడిగాడు. చైనాలో FSD కార్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రశ్నించాడు. అందుకు మస్క్ "త్వరలోనే" అని బదులిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన చైనాకి వెళ్లడం వల్ల త్వరలోనే అక్కడి మార్కెట్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థవుతోంది. Reuters వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే...2021 నుంచి చైనాలో FSDకి అవసరమైన డేటానంతా సేకరించింది టెస్లా. అయితే...పూర్తి స్థాయిలో దాన్ని బదిలీ చేయాలంటే అక్కడి అధికారుల అనుమతి అవసరం. నాలుగేళ్ల క్రితమే ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లను తయారు చేసింది టెస్లా. ఇప్పుడు చైనాలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
భారత్‌లో పెట్టుబడుల సంగతేంటి..?
భారత్‌లో రూ.25 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు ఎలన్ మస్క్. అంతకు ముందు భారత్‌తో చాలా చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈవీ కార్‌ల దిగుమతిపై భారత్ భారీ సుంకాలు విధిస్తున్న అంశంపై చాలా సార్లు చర్చలు జరపాల్సి వచ్చింది. ఎవరికోసమో నిబంధనలు మార్చలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా 100% దిగుమతి సుంకంతో భారత్ మార్కెట్‌లోకి అడుగు పెట్టలేక టెస్లా ఆగిపోయింది. ఆ తరవాత భారత్ మనసు మార్చుకుంది. దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించింది. ఈ మేరకు కొత్త ఈవీ పాలసీని తయారు చేసింది. ఇది టెస్లాకి ప్లస్ అయింది. వెంటనే భారత్‌తో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఢిల్లీలో లేదా ముంబయిలో ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు మస్క్ మోదీతో భేటీ అయ్యి ఆ తరవాత రూట్‌మ్యాప్‌ని ప్రకటించాలని భావించారు. కానీ టెస్లాలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని..అందుకే భారత్‌కి రాలేకపోతున్నానని ప్రకటించారు. ఇప్పుడు చైనా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు.
Also Read: Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్