YS Sharmila on Ponnavolu Sudhakar Reddy: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ న్యాయ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల.. ఇటీవల పొన్నవోలు సుధాకర్ ఇచ్చిన కౌంటర్ పై స్పందించారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి వచ్చిందని గుర్తు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్ లో పెట్టించినందుకే పొన్నవోలుకి ఆ పదవి వచ్చిందని ఆరోపించారు. అది జగన్ పొన్నవోలుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నవోలుపై తాజా వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎవడో తెలియని సుధాకర్ రెడ్డికి 6 రోజుల్లో అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తారా? అంత హడావిడిగా 6 రోజుల్లో సుధాకర్ రెడ్డికి ఎందుకు మేలు చేశారు? పొన్నవోలు అనే లాయర్ ఎవరో ప్రపంచానికి కూడా తెలియదు. జగన్ కోసం సుధాకర్ రెడ్డి పిటీషన్ లు వేశారు. చార్జీ షీట్ లో వైఎస్ఆర్ పేరు పెట్టించారు. దానికి ప్రతిఫలంగా పదవి జగన్ ఇచ్చారు. తండ్రి మీద కేసులు పెట్టిన వారికి ఎవరైనా పదవి ఇస్తారా? మీరు పదవి ఇచ్చారు అంటే మీరు పొన్నవోలు రుణం తీర్చుకోవాలి అనుకున్నారు కదా? ఇది క్విడ్ ప్రొకో. CBI నిజానికి FIR లో కూడా YSR పేరును చేర్చలేదు.
YSR పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ బయటకు రావడం అసాధ్యం అనుకున్నారు. YSR పేరును CBI లో చేర్చాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టులో పొన్నవోలు పిటీషన్ లు వేశాడు. CBI కోర్టు, హై కోర్టు సుధాకర్ రెడ్డి పిటిషన్ లను కొట్టేసింది. సుప్రీం కోర్టు మాత్రం విచారణ జరగనివ్వండి అని చెప్పింది. YSR మీద గౌరవం అని పొన్నవోలు చెప్పే మాటలు అబద్ధం. అభిమాన నాయకుడు అయితే కోర్టుల చుట్టూ పేరు చేర్చాలని తిరుగుతారా? జగన్ ఆదేశాల మేరకే సుధాకర్ రెడ్డి పిటిషన్ లు వేశారు. సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చి జగన్ గారు నిరూపించుకున్నారు. ఇది నిజమో కాదో ఒక సారి ఉండవల్లి అరుణ్ కుమార్ ని అడగండి.
గతంలోనే ఉండవల్లి YSR పేరును జగన్ పెట్టించాడని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చి పేరు నమోదు చేయించారు అని ఉండవల్లి నాతో చెప్పారు. YSR పేరును కాంగ్రెస్ పార్టీ CBI ఛార్జ్ షీట్ లో పెట్టించింది అనేది అవాస్తవం. దొంగ ఎవరు అంటే బుజాలు తడుముకున్నట్లు ఉంది. ఏకవచనంతో ఊగిపోతూ జగన్ మీద గురుభక్తి చాటుకున్నాడు. నేను చెప్పింది నిజం అని ఆయనే అని ఒప్పుకున్నాడు’’ అని వైఎస్ షర్మిల అన్నారు.