AP Pensions News: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్ల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ ఆదేశాలతో వాలంటీర్ల నుంచి పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని.. మే నెల వృద్ధాప్య పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మే 1న వృద్ధాప్య, దీర్ఘకాలిక సమస్యలతో మంచానికే పరిమితమైన వారికి పింఛన్లు ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, ఏపీ సీఎస్ జవహార్ రెడ్డికి లేఖ రాశారు.


మే నెల పింఛన్లపై కూటమి నేతల లేఖలు 
ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లకు బదులుగా వేరే ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయించాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారని వినతిపత్రంలో ఎన్డీఏ కూటమి నేతలు పేర్కొన్నారు. గ్రామ సచివాల ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సాధ్యమైనంత త్వరగా పింఛన్ పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు.


ఏప్రిల్ నెలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కొందరి దురుద్దేశం కారణంగా పింఛన్ కోసం వృద్ధులు ఆఫీసులకు రాగా, 33 మంది ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోయారని లేఖలో కూటమి నేతలు తెలిపారు. కనుక ప్రజల ప్రాణాల్ని రక్షించాలంటే, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ను ఆదేశించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రాసిన లేఖలో కోరారు. అదే సమయలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సైతం కూటమి నేతలు లేఖ రాశారు. ఈసీ నిబంధనల్ని పాటించి, మే నెల పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మే నెలలో పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు స్పష్టం చేశారు.