Revanth Reddy Meet Tammineni Veerabhadram :  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించుకుంది. సీపీఎం ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేసిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.  లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.  అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరారు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  బీజేపీ, ఇతర శక్తులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకులతో చర్చించామన్నారు. 


సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రంను కోరిన రేవంత్ రెడ్డి                                             


భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామని..  బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారన్నారు.  దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని రేవంత్ గుర్తు చేశారు.  ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా... అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు.  సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతామని ప్రకటించారు.  ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నానన్నారు. 


ఇప్పటికే మద్దతు ప్రకటించిన  సీపీఐ                                  


కమ్యూనిస్టుల్లో మరో పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ కు  మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. అయితే సీపీఐకి ఒక్కటంటే ఒక్క స్థానమే కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త గూడెం కేటాయించడంతో అక్కడ సీపీఐ గెలిచింది. కానీ తమకు కూడా ఒక్క సీటే కేటాయిస్తామని చెప్పడంతో .. సీపీఎం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోలేదు. విడిగానే  పోటీ చేసింది. బలం ఉన్న చోటల్లా పోటీ చేసినా.. స్వయంగా తమ్మినేని  వీరభద్రం పోటీ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. 


జాతీయ స్థాయిలో కూడా కలసి పని చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు     


అయితే సీపీఎం అభ్యర్థుల వల్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరుగుతుందన్న భావనతో  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేస్తున్న కమ్యూనిస్టులతో మాట్లాడాలని నిర్ణయించుకన్నారు. అందుకే తమ్మినేని వీరభద్రంను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కొంత ఓటు  బ్యాంక్ ఉన్న సీపీఎం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత మేర ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.