Andhra Pradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న సూపర్ 6 లాంటి హామీలు అమలు చేసేందుకు భారీ బడ్జెట్ కావాలన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు పాలనతో తన పాలన పోలుస్తూ స్లైడ్స్ వేశారు. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సూపర్ 6 లకు సూపర్ 10 లకు ఎంత ఖర్చు అవుతుంది. సాధ్యమేనా... 2014 మాదిరిగానే మోసం చేసేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజలు ఆలోచించాలి. 2019లో ఇచ్చిన హామీలకు సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. చంద్రబాబు చెబుతున్న హామీలకు లక్షా 21వేల ఆరు వందల 19 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే పథకాలు ఆపడం ఎవరి తరం కాదు. విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, గోరుముద్ద, ఇలాంటి పథకాలు ఆపేయలేరు. మొత్తం కలిపితే లక్షా యాభైవేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇలా ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. సాధ్యం కాదని తెలిసి ఇస్తూ అబద్దాలు చెబుతున్నారు.
అదనంగా 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెబుతున్నారు. ప్రతి సందర్భంలో కూడా సంపద సృష్టిస్తాను అంటున్నారు. పద్నాలుగేళ్ల ఆయన పాలన చూస్తే... ఏ సంవత్సరంలోనైనా ఆదాయం మిగులు లేదు. ఎప్పుడూ కొరతే ఉంది. ఇలా అయితే ఎప్పుడు సంపద సృష్టించావు.. ఎప్పుడు సృష్టిస్తావు. చంద్రబాబు లేని పాలన చూస్తే ఎప్పుడూ ఆదాయం బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిటీ ఉండటం ఆయనకే చెల్లుతుంది. సంపద సృష్టించే శక్తి లేదు. సమర్థవంతమైన ఆర్థిక నియంత్రలేదు. 14 ఏళ్ల పాలన మొత్తం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడానికి పరిమితం అయ్యారు.