DC vs MI IPL 2024 Mumbai Indians target 258: ముంబై ఇండియన్స్‌(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ(DC) బ్యాటర్లు... ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలి బంతి నుంచి ప్రారంభమైన విధ్వంసం.. మధ్యలో కాస్త నెమ్మదించినా చివరికి మళ్లీ తుపానుగా మారింది. ఆరంభంలో జాక్ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ బ్యాటింగ్‌ చూస్తే ఈ మ్యాచ్‌లో 300 పరుగుల స్కోరు నమోదవ్వడం ఖాయమనే అనిపించింది. కానీ మెక్‌గర్క్‌ అవుట్‌ కావడంతో ఢిల్లీ స్కోరు కాస్త నెమ్మదించింది. కానీ చివర్లో పంత్‌, స్టబ్స్‌ ధాటిగా ఆడడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి  257 పరుగులు చేసింది.


తొలి బంతి నుంచే 
 ఢిల్లీ ఓపెనర్లు ఫ్రేజర్‌- అభిషేక్‌ పోరెల్‌ తొలి బంతి నుంచే విధ్వంసం ప్రారంభించారు. ముఖ్యంగా ఫ్రేజర్‌...విధ్వంసం సృష్టించాడు. ఫ్రేజర్‌ లూక్‌ వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదేశాడు. తొలి ఓవర్‌లోనే ఢిల్లీకి 19 పరుగులు వచ్చాయి. తర్వాత బుమ్రాను వదలని జేక్‌ ఫ్రేజర్... 18 పరుగులు పిండుకున్నాడు. బుమ్రా వేసిన ఓవర్‌లో సిక్స్‌, రెండు ఫోర్లు బాదేశాడు. ఆ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. నువాన్ తుషారా వేసిన మూడో ఓవర్‌లోనూ 4 ఫోర్లు బాదిన ఫ్రేజర్‌ 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఢిల్లీ స్కోరు మూడు ఓవర్లకే 55 పరుగులకు చేరింది. 15 బంతుల్లోనే జేక్‌ ఫ్రేజర్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. పీయూష్ చావ్లా వేసిన నాలుగో ఓవర్‌లో ఫ్రేజర్‌ సిక్స్, ఫోర్ కొట్టాడు. తర్వాత కెప్టెన్‌ పాండ్య బౌలింగ్‌కు వచ్చినా జేక్ ఫ్రేజర్ వెనక్కి తగ్గలేదు.  కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో ఫ్రేజర్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు.



ఆ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లకు కాస్త బ్రేక్ పడింది. పవర్‌ప్లేలో చివరి ఓవర్‌ను బుమ్రా కట్టుదిట్టంగా వేశాడు. ఆ ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. పవర్‌ ప్లే ఆరు ఓవర్లలో ఢిల్లీ ఒక వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో ఎక్కువ రన్స్‌ చేసిన మూడో బ్యాటర్ ఫ్రేజర్ రికార్డు సృష్టించాడు. 78 పరుగులు చేశాడు. పాండ్య వేసిన తర్వాతి ఓవర్‌లో కూడా 20 పరుగులు వచ్చాయి. ముంబైను బెంబేలెత్తించిన జేక్ ఫ్రేజర్ 84 పరుగుల చేసి ఔటయ్యాడు. దీంతో 114 పరుగుల వద్ద దిల్లీ తొలి వికెట్‌ను నష్టపోయింది. నబీ వేసిన ఓవర్‌లో  36 పరుగులు చేసిన పోరెల్ కూడా అవుటయ్యాడు.  12వ ఓవర్‌లోనే ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది. షై హోప్, పంత్‌ ధాటిగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న షై హోప్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. లూక్ వుడ్‌ బౌలింగ్‌ రెండు సిక్స్‌లు కొట్టిన భారీ షాట్‌కు యత్నించిన హోప్‌... డీప్ మిడ్‌ వికెట్‌ వద్ద తిలక వర్మ చేతికి చిక్కాడు. దీంతో 180 పరుగుల వద్ద దిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. లూక్ వుడ్ వేసిన నాలుగు బంతులను ఒకేలాంటి షాట్లతో స్టబ్స్‌ బౌండరీలుగా మలిచాడు. రిషభ్‌ పంత్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. బుమ్రా వేసిన ఓవర్లో పంత్‌ రోహిత్ చేతికి చిక్కాడు. చివర్లో స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.