Mohan Bhagwat On Revanth Reddy Comments: దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మోహన్ భగవత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది వ్యక్తులు ఆర్ఎస్ఎస్ పై స్వార్థంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్యం, అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని మోహన్ భగవత్ ఆక్షేపించారు. ఎవరి కోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారి అభివృద్ధి జరిగేంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మోహన్ భగవత్ మరో మారు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశంపై వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, దానితో తమకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆర్ఎస్ఎస్ పై అనవసరమైన ఆరోపణలు చేయవద్దని ఈ సందర్భంగా మోహన్ భగవత్ సూచించారు. 


అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే


ఆర్ఎస్ఎస్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలోనే మోహన్ భగవత్ స్పందించారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్ల రహిత దేశంగా భారత్ ను ప్రకటించడానికి బీజేపీ 400 సీట్లు కోరుతోందని రేవంత్ విమర్శించారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ కు బలమైన కారణాలు ఉన్నాయన్నారు.


హిందువుల్లో కులాలు, ఉప కులాలు ఉంటే హిందువులు అంతా ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టే, రిజర్వేషన్లు రద్దు చేసి ఈ మొత్తాన్ని హిందూ సమాజంగా చూపించడానికి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రణాళికలను బిజెపి అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే త్రిపుల్ తలాక్ రద్దు, 370 ఆర్టికల్ రద్దు, యూనిఫాం సివిల్ కోడ్ వంటి అనేక నిర్ణయాలను బిజెపి తీసుకుంటోందన్నారు.   ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను బిజెపి అమలు చేస్తోందన్న రేవంత్.. బిజెపి వచ్చినా, రాకపోయినా రాజ్యాంగాన్ని సమూల మార్పులకు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని,  తద్వారా దళితులు, గిరిజనులు, బీసీలు, ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవాన్ స్పందించారు.