Temperatures in Bengaluru: నీటి కొరతతో అల్లాడిపోతున్న బెంగళూరుని (Bengalaru Temperature) ఎండలు కూడా సతమతం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వర్షపాతం లేక అక్కడి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇప్పుడీ ఎండలకు నీటి కొరత సమస్య మరింత పెరిగే ముప్పు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో అక్కడ సగటున 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 27న ఈ స్థాయిలో టెంపరేచర్ రికార్డ్ అవడం బెంగళూరు వాసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. IMD సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...ఎప్పుడూ చల్లగా ఉండేబెంగళూరులో ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఇలా ఎండలు మండిపోతున్నాయి. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. వర్షాలు సరిగా కురవకపోవడాన్ని అతి పెద్ద సవాల్‌గా చూడాలని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. మార్చి 30వ తేదీన సిటీలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ నెలలో ఇదే రికార్డు. ఆ నెలలోనే కాదు. గత ఐదేళ్లలో మార్చిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. 2017 మార్చిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఆ తరవాత మళ్లీ ఇప్పుడే సిటీ ఉడికిపోతోంది. 


కేవలం బెంగళూరులోనే కాదు. కర్ణాటకలో చాలా చోట్ల 40 డిగ్రీలుగా ఉంటున్నాయి ఉష్ణోగ్రతలు. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని IMD హెచ్చరించింది. ేఅయితే...ఈ ఎండల తీవ్రతలోనే కాస్తంత ఉపశమనం కలిగించే వార్త కూడా చెప్పింది IMD.బెంగళూరు అర్బన్, విజయపుర, హస్సన్, చిత్రదుర్గతో పాటు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఏప్రిల్ 30 నుంచి మే 3 మధ్య కాలంలో వానలు కురుస్తుండొచ్చని వెల్లడించింది. ఇప్పటికే బీదర్, హవేరి, కలబుర్గి, రాయ్‌చూర్, బళ్లారి సహా మరి కొన్ని ప్రాంతాలకు IMD యెల్లో అలెర్ట్ జారీ చేసింది.