Titanic Passenger's Gold Watch: టైటానిక్ మునిగిపోయి 112 ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది. అది మునిగిపోయిన చోట శిథిలాలు చూసేందుకు ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్‌లూ అందుబాటులోకి వచ్చాయి. టైటానిక్‌కి ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. ఈ ఓడలో ప్రయాణించిన ఓ సంపన్నుడి పాకెట్ వాచ్‌ని వేలం వేస్తే 1.46 మిలియన్ డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ.12 కోట్లపైమాటే. ఇప్పటి వరకూ టైటానిక్‌కి సంబంధించిన ఏ వస్తువూ ఈ స్థాయిలో ధర పలకలేదు. అప్పట్లో John Jacob Astor అనే ఓ బిజినెస్‌మేన్ టైటానిక్‌లో ప్రయాణించాడు. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన జేబులో దొరికిన ఈ Pocket Watch ని వేలం వేయగా అమెరికాకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేశారు. టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఓ వ్యక్తి వయోలిన్ వాయించాడని చెబుతారు. ఆ వయోలిన్‌ని వేలం వేయగా అది 1.1 మిలియన్ పౌండ్‌లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు వాచ్‌ని వేలం వేసిన సంస్థే 2013లో ఈ వయోలిన్‌ని వేలం వేసింది.
అన్ని ఫీజ్‌లు, ట్యాక్స్‌లు కలుపుకుని గడియారానికి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైటానిక్‌కి సంబంధించిన ఏ వస్తువుని వేలం పెట్టినా ఊహించని స్థాయిలో స్పందన వస్తోందని చెబుతోంది. ఇలాంటి అరుదైన వస్తువులు ఇంట్లో ఉంచుకోడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అంటోంది. ఈ షిప్‌లో ప్రయాణించిన 2 వేల మందికి పైగా ప్రయాణికుల కథలపై ఇప్పటికీ ప్రపంచానికి ఆసక్తి ఉందని వివరిస్తోంది. బిజినెస్‌మేన్ జాకోబ్ టైటానిక్ మునిగిపోతోందని తెలిసినా ఏ మాత్రం టెన్షన్ పడలేదట. లైఫ్‌బోట్ గురించి ఎదురు చూడకుండా నింపాదిగా కూర్చుని ఎవరితోనే ఛాటింగ్ చేస్తూ స్మోక్ చేశాడట. ఇంతలోనే ఓడ మునిగిపోయి అంతా చనిపోయారు. దాదాపు వారం రోజుల తరవాత సముద్రంలో జాకోబ్ మృతదేహాన్ని గుర్తించారు.