Elon Musk on Work From Home Culture:


WFHపై సీరియస్..


ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ మరోసారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌పై సెటైర్లు వేశారు. ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్న ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వర్క్‌ప్లేస్‌లో అందరూ కలిసి పని చేసుకోవడం మంచిదని తేల్చిచెప్పారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని గట్టిగా వాదిస్తున్నారు మస్క్. మరో కీలక విషయం ఏంటంటే...కొందరికే ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల మిగతా ఉద్యోగులు కూడా అలాంటి ఆప్షన్ లేదన్న అసహనంతో పని చేస్తారని తేల్చి చెప్పారు. ఈ కారణంగా...పూర్తిగా కంపెనీ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని చెబుతున్నారు మస్క్. 


"ఎంతో మంది కార్మికులు కష్టపడుతున్నారు. కార్‌లు తయారు చేస్తున్నారు. సర్వీసింగ్ చేస్తున్నారు. ఇళ్లు కడుతున్నారు. ఎవరి ఆహారం వాళ్లే తయారు చేసుకుంటున్నారు. అవసరమైన పనులన్నీ స్వయంగా చేస్తున్నారు. ఇవన్నీ రొటీన్‌గా జరుగుతున్నవే. అలాంటప్పుడు ఆఫీస్‌కి రావడానికి కష్టమేముంది. ఇది కూడా పనే కదా. వర్క్‌ప్లేస్‌కి కచ్చితంగా రావాలని చెబుతున్నా రావడం లేదు. ఇది కేవలం ప్రొడక్టివిటీ సమస్య మాత్రమే కాదు. మోరల్‌గా ఆలోచిస్తే...పని చేసే తీరు ఇది కాదు. అందరూ ఆఫీస్‌కి వచ్చి పని చేసుకుంటేనే మంచిది. ఇలా ల్యాప్‌టాప్‌లతో పని చేసుకునే వాళ్లంతా వేరే ఊహా ప్రపంచంలో బతుకుతున్నారు."


-ఎలన్ మస్క్, ట్విటర్, టెస్లా సీఈవో 


గతేడాదే అల్టిమేటం..


ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సార్లు ఎలన్ మస్క్ వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌పై అసహనం వ్యక్తం చేశారు. గతేడాది టెస్లా ఉద్యోగులందరికీ అల్టిమేటం కూడా ఇచ్చారు. వారానికి కనీసం 40 గంటల పాటు ఆఫీస్‌లో పని చేయాలని తేల్చి చెప్పారు. ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలన్ మస్క్ ఆ కంపెనీలో చాలానే మార్పులు తీసుకొస్తున్నారు. వచ్చీ రాగానే లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఆ తరవాత ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చాడు. ట్విటర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపాడు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశాడు మస్క్. అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశాడు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాడు. Bloomberg రిపోర్ట్ ప్రకారం...ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపాడు. వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విటర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశాడు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విటర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశాడు.


Also Read: Karnataka CM Race: ఆయన వల్లే కాంగ్రెస్‌ ఇలా తయారైంది, సిద్దరామయ్యపై శివకుమార్ నెగటివ్ ఫీడ్‌బ్యాక్?