Election For Congress Chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? చాలా కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోన్న ప్రశ్న ఇదే. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఓ గుడ్‌న్యూస్ ఏంటంటే? ఆగస్టు 21 నుంచి కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి.
రాహుల్ ఉంటారా?
అయితే అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ పడతారా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాహుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మరోమారు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
గాంధీయేతర వ్యక్తి
గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై కూడా పార్టీలో సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదర లేదు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అధ్యక్ష పదవి గాంధీ కుటుంబంలోని వ్యక్తే చేపట్టాలని కోరుతున్నారు. అదే పార్టీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ఓటమికి బాధ్యతగా
రాహుల్ గాంధీ 2017లో సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితం కావటంతో మే నెలలో పార్టీ పగ్గాలను వదులుకున్నారు.
జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు రాహుల్ గాంధీ. 'భారత్ జోడో' పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ఈ యాత్ర.. గాంధీ జయంతి రోజున ప్రారంభం కానుంది. జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జవసత్వాలు తిరిగి వస్తాయని పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఈ యాత్ర ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కూడా జరిగితే పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!
Also Read: India's Place New World Order: ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తూటా వాడాలో భారత్‌కు మాత్రమే తెలుసు!