ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామ సచివాలయం. ఈ ఉద్యోగులు అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు పనిచేస్తున్నారు. అయితే కొందరు చేసే పనులతో పూర్తిగా సచివాలయ వ్యవస్థకు చెడ్డ పేరొస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. దివ్యాంగ, వృద్ధాప్యపు పింఛన్లు సకాలంలో మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిన సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించినందుకు, వాలంటీర్లను టార్గెట్ చేశారు. గ్రామ సచివాలయంలో వాలంటీర్లు కూర్చొనేందుకు ఏర్పాటు చేసే కుర్చీలనే తీయించేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై తమ పై అధికారి అని ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తే ఈ సారి అలా జరక్కుండా చూద్దాం అంటూ లైట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న చోటపై ఉద్యోగుల పెత్తనాన్ని భరించలేమంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు వాలంటీర్లు.
తుమ్మలపల్లి గ్రామ సచివాలయం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామ సచివాలయంలో ఈ ఘటన జరిగింది. సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించడంతో వాలంటీర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు. సంబంధిత సచివాలయ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల గత ఏడు నెలలుగా పింఛను కోల్పోయిన లబ్ధిదారులు, వివక్షను ఎదుర్కొంటున్న వాలంటీర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తుమ్మలపల్లి గ్రామంలో జనవరి నెలలో కొందరు పించన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్త పింఛన్లు జనవరిలో దరఖాస్తు చేసుకున్నవారికి మంజూరయ్యే అవకాశాలుండగా గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన దరఖాస్తులను పక్కన పడేశారు.
పింఛన్లు మంజూరు కాలేదు..
గ్రామంలో సుమారు అయిదు పింఛన్లు మంజూరు కాకపోవడంతో వాలంటీర్లు ఓ సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించారు. దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోగా నిర్లక్షంగా సమాధానం చెప్పిందని, అయితే వారి దరఖాస్తులు ఆ ఉద్యోగి టేబుల్ డెస్క్ లో కనిపించాయని చెప్పారు. ఈ విషయం బయటకు రావడంతో వాలంటీర్లుపై అగ్రహించిన ఆ సచివాలయ ఉద్యోగి నుంచి వాలంటీర్లకు వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా మరికొందరు సచివాలయ ఉద్యోగులు కలిసి తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని వాలంటీర్లు అరోపించారు.
సచివాలయంలో ఇంత దారుణమా ?
కనీసం కూర్చొనేందుకు కూడా అవకాశం లేకుండా చేయాలని కుర్చీలను తీయించేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు సచివాలయంలోకి రావాలంటే తమ పర్మిషన్ అడిగి రావాలని, వారి వద్ద నిలబడే ఉండాలని హుకుం జారీ చేశారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. గ్రామంలో సచివాలయ ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని, కేవలం సచివాలయంలో కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ సచివాలయ ఉద్యోగి నిర్లక్ష్యం వల్లనే గత ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛను కోల్పోయామని బాధిత అర్జీదారులు ముంగండ ఈశ్వరరావు, కుంచే భాగ్యలక్ష్మి ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పింఛను లబ్దిని కోల్పోయిన గ్రామస్తులు పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Konaseema District: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం !
ABP Desam
Updated at:
10 Aug 2022 02:14 PM (IST)
Konaseema District: గ్రామ సచివాలయంలో వాలంటీర్లు కూర్చొనేందుకు ఏర్పాటు చేసే కుర్చీలనే తీయించేయడం కలకలం రేపుతోంది.
గ్రామ వాలంటీర్లు
NEXT
PREV
Published at:
10 Aug 2022 01:15 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -