Earthquakes In India:



NGRI సైంటిస్ట్ హెచ్చరిక..


ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో నేల కుంగిపోవడం, ఇళ్లకు పగుళ్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. హిమాలయాలకు సమీపంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎప్పుడైనా ఎదురు కావచ్చని నిపుణులు ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు మరోసారి ఓ నిపుణుడు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హిమాలయాలకు దగ్గర్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ భూమి ఏటా 5 సెంటీమీటర్ల మేర కుచించుకుపోతోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో భూకంపాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. హైదరాబాద్‌కు చెందిన  National Geophysical Research Institute (NGRI) సైంటిస్ట్ డాక్టర్ ఎన్ పూర్ణచంద్ర రావు ANIతో కీలక విషయాలు వెల్లడించారు. 






"భూమి ఉపరితలంపైన చాలా ప్లేట్‌లు ఉంటాయి. అవి నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఇండియాలోని నేలపైన ఈ ప్లేట్ 5 సెంటీమీటర్ల మేర కదులుతోంది. ఇది హిమాలయాలపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదముంది. ఉత్తరాఖండ్‌లో 18 సెసిమోగ్రాఫ్ స్టేషన్‌ల నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు నేపాల్, ఉత్తరాఖండ్‌లలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి." 


డాక్టర్ ఎన్ పూర్ణచంద్ర రావు, సైంటిస్ట్


ఈ జోన్‌లలో డేంజర్..


ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో రెండ్రోజుల క్రితం భూకంపం నమోదైంది. 3.6 మ్యాగ్నిట్యూడ్‌తో 56 కిలోమీటర్ల మేర భూమి కంపించింది. లోతు పరంగా చూస్తే 10 కిలోమీటర్ల వరకూ ప్రభావం కనిపించినట్టు అధికారులు తెలిపారు.  ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే..భారత్‌లో 59% మేర భూమి కంపించే ప్రమాదం ఉందని తేలింది. 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలూ "రిస్క్ జోన్‌"లో ఉన్నట్టు వెల్లడైంది. వీటిని ప్రభుత్వం హై రిస్క్ కింద "Zone-5"లో చేర్చింది. ఢిల్లీలోని NCR ప్రాంతం Zone-4లో ఉంది. 2021లో లోక్‌సభలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. 59% మేర భూమి ప్రమాదకర స్థితిలో ఉందని వివరించారు. సెసిమిక్ జోన్ ఆధారంగా, తీవ్రతను బట్టి జోన్‌లుగా విభజించినట్టు చెప్పారు. Zone-5 "అత్యంత ప్రమాదకర స్థితి"గా పరిగణిస్తారు. అంటే...ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది. Zone-2లో ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే...భారత్‌లోని 11% మేర నేల Zone-5లోనే ఉంది. 18% Zone-4, Zone 3 లో 30% అవకాశాలున్నట్టు కేంద్రం వివరించింది. అత్యంత ఎక్కువగా రిస్క్ ఉంది హిమాలయా ప్రాంతంలోనే. 1905లో కంగ్రా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరవాత 1934లో బిహార్-నేపాల్‌లోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.2గా నమోదైంది. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశీలో సంభవించిన భూకంపానికి 800 మంది చనిపోయారు.


Also Read: Snooping Case: మనీశ్ సిసోడియాకు మరో షాక్ ఇచ్చిన CBI,గూఢచర్యం చేశారంటూ కేసు నమోదు