Droupadi Murmu President of India: చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి పీఠంపై గిరిపుత్రిక అధిరోహించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఓ తెలుగు సీజేఐ.. రాష్ట్రపతి చేత ప్రమాణస్వీకారం చేయించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు, పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, హక్కులకు ప్రతీక అయిన పార్లమెంటులో ఇలా నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. దేశ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీ నమ్మకం, మద్దతుతోనే ఈ కొత్త బాధ్యతలను నిర్వర్తించగలను. స్వతంత్ర భారతావనిలో పుట్టిన తొలి రాష్ట్రపతిగా నేను నిలిచాను. మన దేశ స్వతంత్ర పోరాట యోధుల విశ్వాసాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను. రాష్ట్రపతి వరకు చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. ఇది దేశంలోని పేద ప్రజల విజయం. పేదలు కలలు కనడమే కాదు.. ఆ కలలను సాకారం కూడా చేసుకోగలరు అనడనానికి నా విజయమే నిదర్శనం. ఎన్నో దశాబ్దాలుగా అణగారిన వర్గాలైన పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. నన్ను మీ ప్రతినిధిగా చూడండి. ఎన్నో కోట్ల మంది మహిళల ఆకాంక్షలు, కలలకు నా ఎన్నిక ఓ ప్రతీక. - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
Also Read: President Oath Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం