Mancherial News: కాలికి ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల ప్రాణం విలవిలాడిపోతోంది. అలాంటిది ఓ కర్కశ తండ్రి చేసిన నిర్వాకం ఓ పసి ప్రాణాన్ని తల్లడిల్లేలా చేసింది. సల సలా కాగుతున్న వేడి నూనెను కుమారుడి చేతులపైనా పోసి తండ్రి పైశాచికత్వం ప్రదర్శించాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపుర్ గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటన కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన తల్లిదండ్రులు కుమారుడు బిక్షాటన చేసిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బాలుడు బిక్షాటన చేసి డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు. తండ్రి మద్యానికి డబ్బులు కావాలని అడగడంతో కుమారుడు ఇవ్వడానికి నిరాకరించాడు. కోపంతో తండ్రి కుమారున్ని మూడు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. ఆదివారం (జూలై 25) కాగుతున్న వేడి నూనెను రెండు చేతులపై పోశాడు. బాలుడు గట్టిగా అరవడంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్సను అందించారు. ఇలాంటి పైశాచిక తండ్రిని పోలీసులు కఠినంగా శిక్షించాలని స్థానికులు తెలుపుతున్నారు.
దేవాపూర్ గ్రామానికి చెందిన అబ్బూ అనే 13 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యారు. ఏ పనీ చేయకుండా ఆ బాలుడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు ఆ బాలుడే నాలుగేళ్ల నుంచి భిక్షాటన చేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబం జరుగుతోంది. రెండు రోజుల క్రితం భిక్షాటనకు వెళ్లి డబ్బులు తీసుకురాలేదు. అందుకే అబ్బూ తండ్రి ఇస్మాయిల్ కొడుకును ఇంట్లోనే బంధించాడు. అతనిపై కోపం భరించలేని తండ్రి బాలుడి చేతులపై మరిగే నూనె పోసేశాడు. దీంతో ఆ బాలుడి చేతులపై పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.