ప్రతికూల రాడార్ ముప్పులను భారత వాయుసేన (ఐఏఎఫ్) తిప్పికొట్టేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఓ) కొత్త సాంకితికతను తీసుకువచ్చింది. దీనినే 'అడ్వాన్స్ డ్ చఫ్ టెక్నాలజీ'గా పిలుస్తున్నారు.
ఐఏఎఫ్ అవసరాల మేరకు జోధ్ పూర్ లోని డీఆర్ డీఓ ల్యాబొరేటరీ ఈ సాంకేతికతను తయారు చేసింది. పుణేలోని డీఆర్ డీఓకు చెందిన హెచ్ఈఎమ్ఆర్ఎల్ ల్యాబొరేటరీతో కలిపి ఈ పరిశోధనలు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లో భాగంగా ఈ సాంకేతికతను తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే యూజర్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ క్రిటికలక్ డిఫెన్స్ టెక్నాలజీని ఐఏఎఫ్ వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుత యుద్ధ కాలంలో ఫైటర్ జెట్లను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యమని రక్షణ శాఖ తెలిపింది. దీనిపైనే అన్ని దేశాలు దృష్టి సారించాయని గుర్తు చేసింది. ఆధునిక రాడార్ ముప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి సాంకేతికతలపై భారత్ దృష్టి పెట్టిందని వెల్లడించింది. ఐఏఎఫ్ అవసరాల మేరకు ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు పేర్కొంది.
డీఆర్ డీఓ ఆవిష్కరణపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత తయారీతో ఆత్మనిర్భర్ భారత్ కు మరో ముందడుగు పడిందన్నారు. డీఆర్ డీఓ ఛైర్మన్, సెక్రటరీ, ఆర్ అండ్ డీ డిఫెన్స్ డా. సతీశ్ రెడ్డిని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఈ తయారీ పాల్గొన్న వారందరికీ శుభాభినందనలు తెలిపారు.
యుద్ధ నౌకలకు..
కొద్ది నెలల క్రితం ఇదే సాంకేతికతను భారత నౌకాదళానికి సైతం డీఆర్ డీఓ అందించింది. మిసైల్ దాడుల నుంచి యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. షార్ట్ రేంజ్ చఫ్ రాకెట్, మిడియమ్ రేంజ్ చఫ్ రాకెట్,జ లాంగ్ రేంజ్ చఫ్ రాకెట్.. ఇలా మూడు వేరియంట్లలో దీనిని అందించింది. జోధ్ పుర్ డిఫెన్స్ ల్యాబోరేటరీ వీటిని తయారు చేసింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకలపై వీటిని పరీక్షించారు.
రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీల నుంచి యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను కాపాడుకునేందుకు వినియోగించే ఎలక్ట్రానిక్ టెక్నాలజీని అధునాతన చఫ్ టెక్నాలజీగా పిలుస్తారు.