దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) పేరున్న ఈ కారు భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాటా నుంచి ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ కారు (నెక్సోన్ ఈవీ) విడుదల కాగా.. ఇది రెండోది. టిగోర్ ఈవీ కార్లలో జిప్ట్రాన్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు డీలర్ల వద్ద రూ.21000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ నెల 31 నుంచి వీటి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.






టాటా టిగోర్ ఈవీ స్పెసిఫికేషన్లు ఇవే..
కంపెనీకి చెందిన హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్.. జిప్ట్రాన్ టెక్నాలజీ ఆధారంగా టిగోర్ పనిచేయనుంది. టెక్నాలజీ, కంఫర్ట్, సేఫ్టీ అంశాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. టిగోర్‌ ఈవీ కారు గరిష్టంగా 55 కిలోవాట్ల పవర్‌ను అందిస్తుంది. అలాగే 170 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 26 కిలోవాట్‌ అవర్‌ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీతో 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ మోటార్‌ వారెంటీతో లభిస్తుంది.






టిగోర్ ఈవీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన సీసీఎస్ 2 (CCS2) చార్జింగ్ ప్రోటోకాల్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. అలాగే ఏదైనా 15ఏ ప్లగ్ పాయింట్ ద్వారా స్లో చార్జింగ్ కూడా అందించవచ్చు. రిమోట్‌ కమాండ్స్‌, రిమోట్‌ డయాగ్నోస్టిక్స్‌ సహా 30కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్ అందించారు. 


దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో నెక్సోన్ ఈవీ (Nexon EV) బెస్ట్ కారుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇది ఈవీ విభాగంలో దేశంలో 70 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 


Also Read: Volkswagen Taigun: సెప్టెంబర్‌లో వోక్స్ వేగన్ టైగన్ ఎస్‌యూవీ.. ప్రారంభమైన ప్రీ బుకింగ్స్


Also Read: Vehicle Scrappage Policy: మీ కారు రోడ్డెక్కుతుందా.. జాగ్రత్త.. చెక్ చేసుకోకుంటే చెత్తలోకే..