శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. వెరైటీ కథలను ఇష్టపడేవారికి శ్రీవిష్ణు సినిమాలు బాగా నచ్చుతాయి. ‘గాలి సంపత్’ సినిమాలో శ్రీవిష్ణు నటించినా.. మార్కులన్నీ రాజేంద్ర ప్రసాదే కొట్టేశారు. అయితే, ఈ సారి మాత్రం శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా మొత్తాన్ని తన భుజాన్న ఎత్తుకున్నాడు. ఇప్పటివరకు కనిపించని విభిన్న పాత్రలో కనిపించాడు. కామెడీని పండిస్తూనే.. ఎమోషనల్ సీన్లతోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ సందర్భంగా శ్రీవిష్ణు చెప్పిన మాటలు అంచనాలను మరింత పెంచాయి. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ చిత్రం సినీ ప్రేమికులను మళ్లీ థియేటర్లకు రప్పించగలదా? 


కథ: భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ స్టేషనరీ షాపులో పనిచేస్తుంటాడు. కానీ, అవసరాల కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఈ సందర్భంగా అతడు సంజన (మేఘా ఆకాష్) ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ అని ఆమెకు చెబుతాడు. మొత్తానికి అతడి గుట్టురట్టవుతుంది. అతడు దొంగ అని సంజనకు తెలిసిపోతుంది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. భాస్కర్‌కు అప్పటికే విద్య (సునయన) అనే అమ్మాయితో పెళ్లయ్యిపోతుంది. ఒక బిడ్డ కూడా ఉంటాడు. ఈ విషయం తెలిసి సంజన షాకవుతుంది. మరోవైపు పోలీస్ ఆఫీసర్ విలియం రెడ్డి (రవి బాబు) దొంగతనాలు చేస్తున్న భాస్కర్ కోసం వెతుకుతాడు. మరి భాస్కర్‌కు పెళ్లయినా.. సంజన వెంట ఎందుకు పడ్డాడు? విలియం రెడ్డికి భాస్కర్ దొరుకుతాడా? విద్యతో అతడికి నిజంగానే పెళ్లవుతుందా అనేది తెరమీదే చూడాలి. 


విశ్లేషణ: దర్శకుడు హసిత్‌ గోలి ఎంచుకున్న కథ బాగుంది. టైంపాస్ కామెడీ, డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. అయితే, మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడమే కాస్త ఇబ్బంది పెడుతుంది. అది మినహా.. కథను నడిపించిన విధానం, కామెడీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఈ కథంతా శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సంజనా చుట్టూనే తిరుగుతుంది. మేఘా తన అందంతో ఆకట్టుకుంటే.. సంజనా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. చూస్తుంటే.. ఆమె టాలీవుడ్‌లో మరిన్ని ఛాన్సులు కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గంగవ్వ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 


సినిమా ఫస్ట్ ఆఫ్‌లో దాదాపు 15 నిమిషాల తర్వాతే కథ మొదలవుతుంది. విశ్రాంతి సమయంలో వచ్చే సన్నివేశాలు సెకండ్ ఆఫ్ మీద ఆసక్తిని పెంచుతాయి. అయితే, ఫస్ట్ ఆఫ్‌లో ఉన్నంత వేగం.. సెకండ్ ఆఫ్‌లో కనిపించదు. అదొక్కటే ఈ సినిమాకు మైనస్. అయితే, దర్శకుడు మంచి సందేశాన్ని అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అబద్దం జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎంతగా బాధపెడుతుందనేది బాగా చెప్పాడు. ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో బయటకు వచ్చేలా చేశాడు. కాబట్టి.. శ్రీవిష్ణు నటించిన మంచి చిత్రాల్లో ఒక్కటిగా ఇది నిలిచిపోతుంది. అయితే, అతడు గతంలో నటించిన ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో దీన్ని పోల్చుకోవద్దు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఈ సినిమా చూడవచ్చు. సినిమాలో డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.  


నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, తనికెళ్ల భరణి, రవిబాబు శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు.
దర్శకత్వం: హసిత్ గోలి; నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: వేద రమణ్ శంకరన్; ఎడిటింగ్: విప్లవ్. 


గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.