US President Trump India Tour: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న (సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజింగ్‌తో సంబంధాలను మరింతగా పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాను సందర్శించాలని అనుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. ఆయన తన భారత పర్యటన గురించి సలహాదారులతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనా దిగుమతులపై కొత్త సుంకాలు విధిస్తామని బెదిరించారు. మెక్సికన్ కార్టెల్స్ ఫెంటానిల్ (ఒక రకమైన ఔషధం) తయారీకి కీలకమైన పదార్థాలుగా ఉపయోగించే రసాయన ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బీజింగ్‌ను కోరారు.


అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వార్తాపత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో ఇలా పేర్కొంది..  డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాను సందర్శించాలని అనుకుంటున్నట్లు తన సలహాదారులకు చెప్పారు. ఆయన ఎన్నికల ప్రచారంలో చక్కెర దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఆయన ప్రకటనపై జిన్‌పింగ్ కూడా తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ట్రంప్ తన రెండో పదవీ కాలంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


భారతదేశ పర్యటనకు కూడా ప్లాన్ 
ట్రంప్‌నకు సన్నిహితుల అభిప్రాయం ప్రకారం.. ఆయన భారతదేశ పర్యటన గురించి తన సలహాదారులతో కూడా మాట్లాడారని ఓ వార్తా పత్రిక తన నివేదికలో పేర్కొంది. గత నెల క్రిస్మస్ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వాషింగ్టన్ డిసిని సందర్శించినప్పుడు ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.


Also Read : First Cocaine Case in AP: ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదు, సీజ్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేసిన గుంటూరు ఎక్సైజ్ పోలీసులు


ట్రంప్, ప్రధాని మోదీ భేటీ  
డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరిలో జరగవచ్చు. ఈ ఏడాది మార్చి, జూన్ మధ్య వైట్ హౌస్ సమావేశానికి ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక రోజు ముందు ట్రంప్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను జిన్‌పింగ్ పంపించారు.


జి జిన్‌పింగ్, ట్రంప్ ఫోన్‌ సంభాషణ
అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తొలిసారిగా చైనాకు చెందిన ఒక సీనియర్ అధికారి హాజరు కానున్నారు. ట్రంప్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జి జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. అయితే, చైనా అధ్యక్షుడు ఎప్పుడూ విదేశీ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కారు. 'ట్రూత్ సోషల్' పై ఒక పోస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ ఇలా రాశారు. ‘‘నేను ఇప్పుడే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో మాట్లాడాను. మేము వ్యాపారం, ఫెంటానిల్, టిక్‌ టాక్, మరిన్నింటి గురించి చర్చించాం. మనం కలిసి అనేక సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని నా అంచనా.’’ అని తెలిపారు. 


Also Read : CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​