IT park in Hyderabad: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్యాండ్​ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీ పార్కు కోసం ఆ సంస్థ రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

సీఎం సారథ్యంలో..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఐటీ మినిస్టర్​ శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డా.ఈ.విష్ణువర్ధన్ రెడ్డి, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి, బి.అజిత్ రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి గౌరీ శంకర్‌ నాగభూషణం సహా సీనియర్ క్యాపిటల్యాండ్ అధికారులతో కూడిన తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ప్రస్తుతం సింగపూర్‌ పర్యటన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం క్యాపిటల్యాండ్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో భాగంగా హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడికి క్యాపిటల్యాండ్​ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది.

మరింత బలోపేతంబిజినెస్​ హబ్​గా హైదరాబాద్​ను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పాటునందించనుంది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), బ్లూ-చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా ఇది పనిచేయనుంది. 

హైదరాబాద్​లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిస్తాం..ఈ ఎంఓయూ సందర్భంగా సీఎంవో ప్రత్యేక కార్యదర్శి గౌరీ శంకర్‌ నాగభూషణం మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వ విజన్​కు తోడు​, రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వంలో వ్యాపార రంగంలో హైదరాబాద్ స్థిరంగా దూసుకెళుతోంది. హైదరాబాద్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సంతోషిస్తున్నాం. హైదరాబాద్​లో స్థిరమైన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రయత్నిస్తాం. దీంతో సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ మరింత బలోపేతం కానుంది’ అని అన్నారు.

రూ.3,500 కోట్ల పెట్టుబడులుసీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలో సింగపూర్​లో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతంగా సాగుతోంది. తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు శనివారం ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్​ ఏర్పాటు చేయనున్నారు.