Land Scam Case: కర్ణాటకలో రాజకీయం రోజురోజుకీ ముదురుతోంది. భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌, సిద్దరామయ్య మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనను విచారించాలని గవర్నర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే సిద్దరామయ్య హైకోర్టుని ఆశ్రయించారు. గవర్నర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రాజకీయ కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు.


Mysuru Urban Development Authority (MUDA) కోసం కేటాయించిన స్థలాల్లో అవకతవకలు జరిగాయన్నది సిద్దరామయ్యపై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఆయన సతీమణికి పరిహారంగా ఇచ్చిన భూముల విలువ భారీగా ఉందని, ఈ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. 2021లో జరిగిన లావాదేవీలపై ఆరా తీయాలని డిమాండ్ చేస్తోంది. అయితే..ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఇదంతా రాజకీయ కుట్రేనని తేల్చి చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని వెల్లడించారు.  (Also Read: Kolkata: మొబైల్ నిండా అశ్లీల వీడియోలు, ఆడవాళ్లు కంటపడడమే పాపం - కోల్‌కతా హత్యాచార నిందితుడి షాకింగ్ బ్యాగ్రౌండ్‌)


"నా వ్యక్తిగత పనుల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకోలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదు. బీజేపీ వాళ్లు ఇలాంటివి చెబుతూనే ఉంటారు. నిరసన చేయనివ్వండి. నాకు చట్టంపైన పూర్తి నమ్మకముంది. ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ వేశాను. త్వరలోనే ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. కచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకముంది"


- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి






ఇప్పటికే X వేదికగా సిద్దరామయ్య పోస్ట్ పెట్టారు. గవర్నర్‌ ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆయన చట్టానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ థావర్‌చంద్ గహ్లోట్ మాత్రం విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నారు. పారదర్శకంగా విచారణ జరగాలని స్పష్టం చేశారు. రూ.4-5 వేల కోట్ల విలువ చేసే స్థలాలని ఆయాచితంగా సిద్దరామయ్య సతీమణికి అప్పగించారని, అవకతవకలు జరిగాయని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అటు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా రాజకీయ కుట్రేనని తేల్చి చెప్పారు. సిద్దరామయ్యకు అంతా అండగా నిలబడతామని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ కేసు అక్కడి రాజకీయాల్ని ఎటు మలుపు తిప్పనుందో చూడాలి. 


Also Read: Kolkata: మమతా బెనర్జీని కాల్చి పారేయండి, సోషల్ మీడియాలో విద్యార్థి సంచలన పోస్ట్ - అరెస్ట్ చేసిన పోలీసులు