Kolkata Doctor Murder: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కాల్చి చంపేయాలంటూ ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. బీకామ్ సెకండియర్ చదువుతున్న స్టూడెంట్ ఈ వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. kirtisocial పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ పోస్ట్ పెట్టాడు. వెంటనే మమతా బెనర్జీని చంపేయాలని అన్నాడు. అంతే కాదు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎలాగైతే చంపారో అదే విధంగా మమతా బెనర్జీని హత్య చేయాలని కామెంట్స్ చేశాడు. "మమతా బెనర్జీని కాల్చి పారేయండి. మీకు చేతకాకపోతే నేను చూసుకుంటాను" అని పెట్టిన పోస్ట్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. వెంటనే అధికారులను అలెర్ట్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మరో కీలక విషయం ఏంటంటే...ఈ విద్యార్థి హత్యాచార బాధితురాలి ఫొటోలు, వివరాలు కూడా పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకుండా ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రిపైనే వివాదాస్పద పోస్ట్ పెట్టి బుక్ అయ్యాడు. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అత్యాచార బాధితారులి వివరాలు వెల్లడించడం నేరం అని తేల్చి చెప్పారు.
"సోషల్ మీడియాలో ఓ వ్యక్తి బాధితురాలి ఫొటోని పోస్ట్ చేశాడని కంప్లెయింట్ వచ్చింది. ఇది ముమ్మాటికీ నేరమే. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద పోస్ట్‌లు పెట్టాడు. ఇవి విద్వేషాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఘర్షణలకు దారి తీసే విధంగా ఉన్నాయి. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది"
- పోలీసులు
సోషల్ మీడియాలో రూమర్స్ పోస్ట్ చేస్తున్న వాళ్లపైనా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్‌కి సమన్లు జారీ చేశారు. పోలీస్ కమిషనర్‌ని సీబీఐ విచారించాలని చేసిన కామెంట్స్‌కి ఇలా నోటీసులు అందాయి. ఇక బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో సమన్లు జారీ చేశారు.