Dhankar Vs Jaya Bachchan: రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ ధన్‌కర్..జయాబచ్చన్‌పై అసహనం వ్యక్తం చేశారు. అయితే..జయా బచ్చన్ కూడా అదే స్థాయిలో ధన్‌కర్‌పై మండి పడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఫలితంగా ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. తాను ఓ నటినని చెప్పి జయా బచ్చన్ ఎవరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనని, ఇలా గట్టిగా మాట్లాడడం సరికాదని అన్నారు.
"నేను ఆర్టిస్ట్‌ని. ఓ మనిషి బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలను. మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. మీరు ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే"
- జయా బచ్చన్, ఎంపీ
ఈ వ్యాఖ్యలు చేస్తుండగానే జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె స్పీచ్‌ని అడ్డుకున్నారు. దయచేసి కూర్చోండి అని మందలించారు. మీరు సెలెబ్రిటీ అయితే అయుండొచ్చని కానీ సభా మర్యాదలు పాటించాలని తేల్చి చెప్పారు.
"జయా జీ దయచేసి కూర్చోండి. మీకు బయట చాలా గొప్ప పేరుండొచ్చు. ఓ యాక్టర్ ఎవరైనా డైరెక్టర్ చెప్పినట్టే చేయాలి. ఇప్పటి వరకూ చేసింది చాలు. మీరు సెలబ్రిటీ అయితే అయుండొచ్చు. కానీ సభా మర్యాదలంటూ కొన్ని ఉంటాయి. వాటిని కచ్చితంగా పాటించాల్సిందే"
- జగ్‌దీప్ ధన్‌కర్, రాజ్యసభ ఛైర్మన్
అంతకు ముందు కూడా ఇదే విధంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. పది రోజుల్లో దాదాపు నాలుగు సార్లు ఇద్దరి మధ్యా ఇలాంటి వాదనలే కొనసాగాయి. జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిసారీ భర్త పేరు ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. తమకంటూ ఓ గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. తన భర్త సాధించిన విజయాలకు గర్వంగానే ఉన్నప్పటికీ..మహిళలకు ప్రత్యేక గుర్తింపు అంటూ లేకుండా చేస్తున్నందుకు బాధగా ఉందని అన్నారు జయా బచ్చన్. దీనిపైనా జగ్‌దీప్ ధన్‌కర్ సమాధానమిచ్చారు. ఎలక్షన్ సర్టిఫికేట్‌లో పేరు ఎలా ఉంటే..అలాగే పిలిచినట్టు క్లారిటీ ఇచ్చారు. కావాలంటే పేరు మార్చుకోవచ్చని, అందుకు వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు.
అయితే ఈ పరిణామాల మధ్య అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ సంచలనమవుతోంది. పరోక్షంగా ఈ వివాదంపైనే పోస్ట్ పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. "సమయం చాలా బలమైంది. ఏం జరగాలన్నా వేచి చూడక తప్పదు" అని పోస్ట్ పెట్టారు అమితాబ్. మరి ఈ వివాదానికి ఈ పోస్ట్‌కి ఏదైనా సంబంధం ఉందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కి అండగా సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, అనర్హతా వేటుపై వాదనలకు సిద్ధం