Vinesh Phogat Disqualification: వినేశ్ ఫోగాట్‌పై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే దీనిపై న్యాయపోరాటానికి దిగింది ఫోగాట్. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ Court of Arbitration for Sport (CAS) ని ఆశ్రయించారు. ఈ కేసులో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) తరపున భారత్‌లోనే సీనియర్ లాయర్ అయిన హరీశ్ సాల్వే వాదించనున్నారు. ఈ వివాదానికి సంబంధించిన అన్నీ లీగల్ అంశాలనూ ఆయన పరిశీలించనున్నారు. ఒకప్పుడు సొలిసిటర్ జనరల్‌గా పని చేసిన హరీశ్ సాల్వేకి సుదీర్ఘ అనుభవముంది. ఈ మేరకు ఆయనే ఈ ప్రకటన చేశారు. IOA తరపున వాదించబోతున్నట్టు వెల్లడించారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుంది. పారిస్‌లో ఈ విచారణకు కోర్టు ప్రత్యేకంగా ఓ డివిజన్‌ని ఏర్పాటు చేసింది. అమెరికాకి చెందిన మైఖేల్ లెనార్డ్ ఈ డివిజన్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈ తరహా వివాదాలన్నీ ఇక్కడే విచారణ జరుగుతాయి.
ఎవరీ సాల్వే..?
ఇండియాలో హైప్రొఫైల్ కేసులను డీల్ చేయడంలో హరీశ్ సాల్వే ఎక్స్‌పర్ట్. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసులో వాదించారు. ఆ తరవాత సైరస్ మిస్ట్రీకి వ్యతిరేకంగా రతన్ టాటా చేసిన పోరాటంలోనూ సాల్వేనే వాదించారు. 1992లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా పని చేశారు. 1999 నవంబర్‌లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు. 2015లో హరీశ్ సాల్వేని భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. టాటా గ్రూప్ నుంచి అంబానీ గ్రూప్ వరకూ అందరూ ఆయనకు క్లైంట్సే. రామ జన్మభూమి వివాదం కేసులోనూ హిందువుల తరపున వాదించి అనుకూల తీర్పు రావడంలో సాల్వే కీలక పాత్ర పోషించారు.
ఫోగాట్ రిటైర్‌మెంట్..
ఒలింపిక్స్‌లో అనర్హతా వేటు పడిన వెంటనే రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఇక పోరాడే ఓపిక, బలం లేవని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి తన రిటైర్‌మెంట్ గురించి చెప్పింది. రెజ్లింగ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
"కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కలలతో పాటు నా ధైర్యమూ ముక్కలైపోయింది. ఇకపై పోరాడే బలం నాకు లేదు. గుడ్‌బై రెజ్లింగ్. నీకు జన్మంతా రుణపడి ఉంటాను"
- వినేశ్ ఫోగాట్
ఈ నిర్ణయం ఆమె అభిమానులకు షాక్ కలిగించింది. ఇప్పటికే అనర్హతా వేటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుట్ర చేసి బయటకు పంపారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే..ఇదంతా రూల్స్ ప్రకారమే జరిగిందని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయినా తమ వాదనను వినిపిస్తామని తేల్చి చెప్పింది. ఇంతలోనే వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించడం WFI ప్రెసిడెంట్ సంజయ్ సింగ్‌ని కూడా షాక్‌కి గురి చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం తమతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చర్చించాక ఈ నిర్ణయం తీసుకోవాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు సంజయ్ సింగ్.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన, ఆమీర్ ఖాన్ సమక్షంలో మూవీ చూడనున్న సీజేఐ