Bangladesh Bus Accident:
17 మంది మృతి..
బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. దగ్గర్లోని పలు ఆసుపత్రులకు వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఓ టైర్ పేలిపోయి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు స్థానిక మీడియా చెబుతోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు. బంగ్లాదేశ్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి రహదారుల నిర్మాణంలో లోపాలున్నాయని, డ్రైవర్‌లకూ సరైన రీతిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.