Desh Ka Mahaul Remark: భారత్‌లో పరిస్థితులు బాగోలేవంటూ ఆర్‌జేడీకి చెందిన అబ్దుల్ బారీ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. ప్రపంచ దేశాలన్నింటిలో కేవలం భారతదేశంలోనే ప్రజలంతా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఇక్కడ మైనార్టీలకు కూడా రక్షణ దొరుకుతోందన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేను ఒక విషయం గట్టిగా చెప్పగలను. మైనార్టీలతో సహా ప్రజలందరూ కేవలం భారత్‌లోనే క్షేమంగా ఉండగలుగుతున్నారు. వారికి భద్రత కల్పించడమే కేంద్రం విధానం. సిద్దిఖీ వ్యాఖ్యలు ఏదో ఆవేశంలో మాట్లాడినట్లుగా ఉన్నాయి తప్ప.. అందులో ఏమాత్రం నిజం లేదు. మన దేశంలో మైనార్టీలకు కూడా రక్షణ ఉంది. కానీ చాలా దేశాల్లో మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. - నిత్యానంద్‌రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
రాహుల్‌పై
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కూడా నిత్యానంద్ రాయ్ విమర్శలు చేశారు."భారత్ జోడో యాత్ర"లో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలలో ఆయన మన సాయుధ బలగాలను కించపరిచారని అన్నారు.
ఇది 1960ల నాటి భారతదేశం కాదని చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు గ్రహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న మనతో యుద్ధం చేయడానికి ఏ శక్తి కూడా సాహసించదు యుద్ధం జరిగినా, ఫలితం భారత్‌కు అనుకూలంగానే ఉంటుంది. - నిత్యానంద్ రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ఏమన్నారు?
దేశంలో పరిస్థితులు బాగోలేవని.. అందుకే తన పిల్లల్ని విదేశాల్లో స్థిరపడాలని సూచించినట్లు ఇటీవల ఆర్‌జేడీ నేత సిద్దిఖీ అన్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల గురించి వెల్లడించేందుకు నేనొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు. కుమార్తె.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా పొందింది. ఇక్కడి పరిస్థితులు బాగోలేవని, అందుకే అక్కడే ఉద్యోగాలు సంపాదించి స్థిరపడాలని వారికి నేను సూచించాను. - అబ్దుల్ బారీ సిద్దిఖీ, ఆర్‌జేడీ నేత
Also Read: Karnataka Covid Guidelines: 'ఇక మాస్కులు తప్పనిసరి- న్యూయర్ వేడుకలపై కూడా ఆంక్షలు'