AP TDP Politics : ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. ఓ వైపు అన్నిపార్టీలు రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతూనే మరోవైపు ఇంటిపోరుతోనూ సతమతమవుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది ఆయా పార్టీల్లోనే ఉండటంతో ఎవరికి సీటు ఇవ్వాలో అన్నది పార్టీ అధినేతలకు కష్టంగా మారింది. ముఖ్యంగా అధికారం కోసం తాపత్రయపడుతున్న టిడిపి అధినేత చంద్రబాబుకి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పెద్ద సవాల్ గానే మారనుంది. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
టీడీపీలో టిక్కెట్ల కోసం పోటాపోటీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని దక్కించుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే జిల్లా పర్యటనలు చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడికి సహకారం అందించాల్సిన నేతలు మాత్రం అప్పుడే సీటు కేటాయింపులపై లొల్లి షురూ చేశారు. ఏ నియోజకవర్గం చూసినా ఇదే తీరు కనిపిస్తోంది. లేటెస్ట్ గా అన్నదమ్ముల పోరుకి కేరాఫ్ గా మారిన మరో నియోజకవర్గం తుని. మాజీ మంత్రి యనమల ఇంట్లో తుని సీటు విషయం రచ్చకి కారణమవుతోంది. యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు మధ్య ఈ సీటు వివాదం పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో రామకృష్ణుడు తుని నుంచి కూతురు దివ్యని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఈ సీటుపై కన్నేసిన తమ్ముడు కృష్ణుడు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్న కూతురికి టిక్కెట్ ఇవ్వకుండా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే తొండంగి టిడిపి నేతతో తెర వెనక ప్రయత్నాలు మొదలెట్టారు అన్న విషయం ఫోన్ కాల్ ద్వారా బయటపడింది. ఇప్పుడిదే టిడిపిలో కలకలం రేపుతోంది.
పలు నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య పోరు
తుని మాత్రమే కాదు కృష్ణాజిల్లాలో కూడా కేశినేని బ్రదర్స్ మధ్య సీటు వివాదం ఎంతవరకు వెళ్లిందో తెలిసిందే. కేశినేని నాని, చిన్నిల మధ్య దూరం పెరిగింది. చంద్రబాబు సైతం నానిని పక్కన పెట్టేసి ఆయన సోదరుడు చిన్నికి ప్రాముఖ్యత నివ్వడంతో కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీలోని ఇంటిపోరు ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇక అలాగే టెక్కలి సీటుపై కూడా కింజరాపు ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న రామ్మోహన్ నాయుడుకి ఎంపీ సీటుతోనే సరిపెడుతున్నారు చంద్రబాబు. అయితే రానున్న ఎన్నిల్లో తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు కావాలని రామ్మోహన్ నాయుడు పట్టుబడుతున్నట్లు ఈ మధ్య వార్తలు హడావుడి చేశాయి. అంతేకాదు బాబాయ్ అచ్చెన్నాయుడుతో కూడా దూరంగా ఉంటోన్న రామ్మోహన్ నాయుడు సీటు విషయంలో మరోసారి అన్యాయం జరక్కుండా కార్యకర్తలతో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ ఉంది.
కుటుంబానికి ఒక్క సీటే అనే మాట నిలబెట్టుకుంటారా ?
అనంతపురంజిల్లాలో కూడా జెసీ బ్రదర్స్ మధ్య టిక్కెట్ల లొల్లి నడుస్తోంది. పరిటాల ఫ్యామిలీ నుంచీ రెండు టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఇలా ఏ నియోజకవర్గం చూసినా తెలుగు తమ్ముళ్ల మధ్య అసెంబ్లీ సీటు విషయంలో పెద్ద లొల్లే నడుస్తోందన్నది బహిరంగ రహస్యం. ఓ వైపు జగన్ని ఎలా ఓడించాలన్న ఆలోచనలో ఉన్న టిడిపి అధినేతకి ఇప్పుడు ఇంటి పోరు తిప్పలు తెచ్చిపెడుతోంది. పొత్తుల్లో భాగంగా ఇప్పటికే కుటుంబానికి ఒక్క సీటే అన్న చంద్రబాబు ఇప్పుడు ఎవరికి ఏ సీటు కేటాయిస్తారు..ఎవరికి హ్యాండిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.