Ranga Politics :  ఆంధ్రప్రదేశ్‌లో వంగవీటి రంగా వర్థంతి రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. గుడివాడలో పోటాపోటీగా కార్యక్రమాలు చేశారు. అయితే వైసీపీ  మాత్రం రంగాను ఒక్క గుడివాడలో మాత్రమే వర్థంతి నిర్వహించింది. ఇతర చోట్లా పట్టించుకోలేదు. విశాఖలో నిర్వహించానుకున్న రంగా వర్థంతి కార్యక్రమాని కూడా వైసీపీ నేతలు హాజరు కాకూడదని ఆదేశించింది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో కాపు సామాజికవర్గంలో విశేష ఆదరణ ఉన్న నేతగా ఉన్న వంగవీటి రంగాను అన్ని పార్టీలు గౌరవంగా చూసుకోవడం ప్రారంభించాయి. అకస్మాత్ గా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో వంగవీటి రంగాకు ఒక్క సారిగా ప్రాధాన్యం పెరిగినట్లయింది. 


టీడీపీలో వంగవీటి రంగా కుమారుడు రాధా !


వంగవీటి రంగా జయంతి, వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా విగ్రహాల వద్ద కాపు సామాజికవర్గం నేతలు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. విజయవాడలో ఈ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుగుతాయి. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈ ఏడాది కూడా వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ.. తన తండ్రి వర్ధంతి కార్యక్రమాలపై రాజకీయ నీడలు పడకుండా జాగ్రత్త  పడ్డారు. రంగా అందరి మనిషి అని చెప్పేలా నివాళి అర్పించాలనుకున్న అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించారు.


గుడివాడలో రంగా వర్థంతి సందర్భంగా రాజకీయ యుద్ధం


నిజానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు రంగా వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్నది చాలా తక్కువ. అయితే గుడివాడలో కొడాలి నాని మాత్రం ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. టీడీపీ కూడా రంగా వర్థంతిని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది.కానీ కొడాలి నాని మాత్రం వంగవీటి రాధా తమ కుటుంబసభ్యుడిలాంటి వారని చెబుతూ వస్తున్నారు. టీడీపీ నేతలు రంగా వర్థంతిని చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఘాటుగా బ దులిచ్చారు. రంగా అందరి మనిషి.. ఆయన కుమారుడు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. 


విశాఖ రంగా వర్థంతి కార్యక్రమానికి వైసీపీ దూరం  


రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో రంగా వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ  సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరు కావద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో జై జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. సమావేశం కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే తాజా పరిస్థితుల ప్రభావంతో ఈ మీటింగ్ పూర్తిగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలోనే జరుగనుంది. పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగనుంది. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్‌ లో ఈ సభ ఏర్పాటు కానుంది. గంటా శ్రీనివాస్ దీనికి నాయకత్వం వహించనున్నారు.


కొన్ని నియోజకవర్గాల్లో వంగవీటి రంగా విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యూహాత్మకంగా నివాళి అర్పించారు కానీ.. ఆ పార్టీ హైకమాండ్ మాత్రం విశాఖ సభకు హాజరు కాకూడదన్న నిర్ణయంతో.. తమ వైఖరి స్పష్టం చేసినట్లయింది.