Karnataka Covid Guidelines: కేంద్రం కరోనా మార్గదర్శకాలు విడుదల చేయడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా కర్ణాటక (Karnataka) ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్- 7 కారణంగా కేసులు ఎక్కువగా నమోదు అవ్వుతుండటంతో మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. అలానే కొత్త సంవత్సరపు వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకే నిర్వహించాలని పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
సినిమా హాళ్ళు, కాలేజీలు, స్కూల్స్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాం. పబ్బులు, రెస్టారెంట్లు, బార్లల్లో కొత్త సంవత్సరపు వేడుకలు చేసుకునేవారికి కూడా మాస్కు ధరించడం తప్పనిసరి. ఈ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే జరుపుకోవాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏసీ రూములు, ఇతర ప్రదేశాల్లో కూడా మాస్కులు ధరించాలని మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. గత వారం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు యాదృచ్చికంగా 2 శాతం మందికి కరోనా పరీక్ష తప్పనిసరి చేశాం. కర్ణాటక అంతా శ్వాస సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసుకోవడం కూడా తప్పనిసరి చేయనున్నాము. కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డులు, ఆక్సిజన్ సరఫరా జిల్లా ఆసుపత్రుల్లో త్వరలో ప్రారంభిస్తాం. ప్రైవేటు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కరోనా రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చెయ్యడానికి ఆదేశాలు ఇస్తాం. - కేశవ సుధాకర్, కర్ణాటక ఆరోగ్య మంత్రి
మళ్లీ
కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో ప్రపంచమంతా గత రెండేళ్ళలో తెలుసుకుంది. లక్షలాది మంది ప్రజలు కరోనా వైరస్ ధాటికి పిట్టల్లా రాలిపోయారు. అన్ని దేశాల ఆర్దిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాలు, ప్రజలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ - 7 వ్యాప్తి.. మళ్ళీ ఆందోళనకు గురి చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోన్న వేళ ఇప్పటికే భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. తాజాగా కొత్త సంవత్సరపు వేడుకలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
సీఎం భరోసా
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సోమవారం మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దశలవారిగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు.
కేబినేట్ సమవేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై చర్చించాం. ఈ సమావేశంలో బూస్టర్ డోస్ తీసుకోవడంపై, శ్వాస సంబందిత సమస్యలు (SARI), ఇన్ఫ్లుఎంజా అనారోగ్య సమస్యలు (ILI)కు వైద్య పరీక్షలు చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై అవగాహన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. దశలవారిగా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టి, సాధారణ జీవనం, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటాం. - బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి